ఏపీలో బలం పుంజుకుంటున్న కాంగ్రెస్.. త్రిముఖ పోరు అనివార్యమా?

by Disha Web Desk 2 |
ఏపీలో బలం పుంజుకుంటున్న కాంగ్రెస్.. త్రిముఖ పోరు అనివార్యమా?
X

నానాటికీ కాంగ్రెస్​బలం పుంజుకుంటోంది. పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వైఎస్​షర్మిల.. సమకాలీన అంశాలపై అధికార, ప్రతిపక్షాల కూటములను ఇరుకున పెట్టేస్తున్నారు. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి​పాలనకు వారసురాలిగా ఫోకస్​అవుతున్నారు. కాంగ్రెస్​ పార్టీ లేవనెత్తుతున్న ప్రత్యేక హోదా, విభజన హామీలు, ప్రజలపై అలవికాని భారాల గురించి ఇప్పటిదాకా నినదిస్తున్న వామపక్షాల గొంతుక తోడు కలిసే అవకాశాలున్నాయి. దీంతో ఎవరి విజయావకాశాలను షర్మిల దెబ్బతీస్తారోనని వైసీపీ, టీడీపీ కూటములు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రస్తుతం దీనిపైనే ప్రజల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తొత్తులుగా మారాయంటూ షర్మిల కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతా ఎలుగెత్తి చాటుతున్నారు. బీజేపీ అంటే మండిపడుతున్న తటస్థులను ఆలోచనలో పడేస్తున్నారు. ప్రత్యేక హోదా నుంచి విభజన హామీలు, అమరావతి రాజధాని లాంటి అంశాలపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఆమె ఎండగడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆలంబనగా నిలిచిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూస్తున్నారంటూ షర్మిల దుయ్యబడుతున్నారు. ఈ వర్గాలను తిరిగి కాంగ్రెస్​ పార్టీకి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అణగారిన బహుజన వర్గాల అభ్యున్నతి కోసం మేనిఫెస్టోలో ప్రాధాన్యమిస్తామని భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్​ బలోపేతం కావడానికి దోహదపడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రచారానికి రానున్న ప్రముఖులు?

కాంగ్రెస్​యువనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, పొరుగునున్న ముఖ్యమంత్రులు రేవంత్​రెడ్డి, సిద్ద రామయ్యలాంటి వారిని ఎన్నికల ప్రచారానికి త్వరలో దించనున్నట్లు ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటిదాకా మోడీ, జగన్​పాలనపై విరుచుకు పడుతున్న వామపక్షాలకు ఇప్పుడు కాంగ్రెస్​కలిసింది. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల కూటమి ఏర్పడేందుకు అవకాశాలున్నాయి. తెలంగాణలో అధికారం కోసం పోటీ పడే స్థాయిలో కాంగ్రెస్​ఉన్నందున వామపక్షాలతో సరైన అవగాహన కుదరలేదు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేనందున ఇరుపార్టీలు కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

వైసీపీపైనే ప్రభావం..

కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే ఎవరి విజయావకాశాలను ప్రభావితం చేస్తారనేది చర్చనీయాంశమైంది. షర్మిల, కాంగ్రెస్​ పార్టీ ప్రభావం ప్రధానంగా వైసీపీ మీదనే ఎక్కువగా ఉంటుంది. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్​లో చేరే అవకాశమున్నట్లు ఇటీవల ఆ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు వెల్లడించారు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరితే.. కాషాయ పార్టీకి ఓటెయ్యడానికి ఇష్టం లేని టీడీపీ, జనసేన ఓటర్లు కాంగ్రెస్​, వామపక్షాల వైపు మొగ్గు చూసే చాన్స్ ఉంది. తటస్థులు కూడా కాంగ్రెస్​ పట్ల ఆకర్షితులవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పుడు త్రిముఖ పోరు అనివార్యమవుతుంది. కాంగ్రెస్, వామపక్షాల వల్ల ఎవరికెంత డ్యామేజ్ జరుగుతుందనే దానిపై అన్ని పక్షాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.



Next Story

Most Viewed