'స్కిల్' స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం.. మంత్రి గుడివాడ అమర్నాథ్

by Dishafeatures2 |
స్కిల్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం.. మంత్రి గుడివాడ అమర్నాథ్
X

దిశ, ఉత్తరాంధ్ర: యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించే ముసుగులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 371 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు నైపుణ్యాభివృద్ధిని కల్పిస్తామన్న సాకు చూపి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు తన జేబులో వేసుకున్నాడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, ఆయా పరిశ్రమలలో పనిచేసే యువతకు అవసరమైన నైపుణ్యాన్ని కల్పించనున్నామని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి సీమెన్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారని అన్నారు.

ఇందుకోసం 6 క్లస్టర్లని ఏర్పాటు చేస్తున్నట్లు, ఒక్కో క్లస్టర్ కు రూ. 560 కోట్ల చొప్పున సుమారు రూ. 3,300 కోట్ల ఖర్చు చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారని అమర్నాథ్ చెప్పారు. ఇందులో 10 శాతం అంటే సుమారు రూ. 370 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన 90 శాతం మొత్తాన్ని సీమెన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ప్రకటించి ఈ స్కామ్ ని ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. అలాగే ఈ కుంభకోణంలో సింగపూర్ కు చెందిన స్కిల్లర్, ఇన్ వెబ్ సొల్యూషన్స్ వంటి ఆరు షెల్ కంపెనీలను చూపించి రూ 371.25 కోట్ల ను ఆయా కంపెనీలకు చంద్రబాబు నాయుడు అండ్ కో తరలించారని చెప్పారు. ఇందులో స్కిల్లర్ కంపెనీ పేర 185 కోట్ల రూపాయలు బదిలాయించారని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు నేరుగా ఈ కంపెనీలకు చేర్పించిన చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన కీలక పత్రాలను మాయం చేశారని మంత్రి అమర్నాథ్ వివరించారు. చంద్రబాబు నాయుడు అక్రమ మార్గంలో చేర్చిన ఈ మొత్తానికి సంబంధించిన లావాదేవీల వ్యవహారం చంద్రబాబు సృష్టించిన ఒక సెల్ కంపెనీ చేసిన మెసేజ్ ద్వారా వెలుగు చూసిందని, దీంతో తీగలాగితే దొంగ కదిలినట్లు చంద్రబాబు నాయుడు బాగోతం బట్టబయలు అయిందని ఆయన అన్నారు.

ప్రభుత్వంలో ఉన్నాం కదా.. తమకేమీ జరగదని చంద్రబాబు నాయుడు భావించారని కానీ దర్యాప్తు సంస్థలు బాబు వ్యవహారాన్ని ఒకటి ఒకటిగా బయటికి తీస్తున్నాయని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాబు ప్రభుత్వంతో సీమెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందా లేదా అన్న విషయమై దర్యాప్తు సంస్థలు ఆరా తీయగా, అటువంటి ఒప్పందం ఏమి తాము కుదిర్చుకోలేదని సీమెన్స్ యాజమాన్యం 2021 మార్చిలోనే లిఖితపూర్వకంగా తెలియజేసిందని మంత్రి అమర్నాథ్ వివరించారు. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంతో సీమెన్స్ సంస్థలోని ఒక అధికారి ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేసినట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిందని, తీరా ఆ వ్యక్తి సీమెన్స్ సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయాడని, ఆ సంతకాలు కూడా ఫోర్జరీ అని తేలినట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఏలేరు నుంచి హైటెక్ సిటీ టు అమరావతి వరకు చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, చివరకు స్టాంపు పేపర్ల కుంభకోణంలో కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని తేలిందని ఆయన అన్నారు.



Next Story

Most Viewed