ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీడీపీలో జోష్

by Disha Web Desk 7 |
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీడీపీలో జోష్
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: శాసనమండలి ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో కొత్త ఊపు వచ్చింది. నిన్నమొన్నటి వరకు సంక్షేమ పథకాలతో ప్రజల్లో దూసుకుపోతున్నామనే భ్రమ కల్పించిన అధికార పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు షాక్ ఇచ్చాయి. పట్టభద్రులు సైతం వైసీపీని వ్యతిరేకించడంతో ఇక టీడీపీ నేతలు ఫుల్ జోష్‌లో మునిగిపోయారు. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని ఫిక్స్ అయ్యారు.

ఇదే ఊపును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బలంగా నిశ్చయించుకున్నారు. అందుకే ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. మరి కొందరైతే సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీ పరిస్థితిపై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ముమ్మడివరంలో బుచ్చిబాబు హవా..

కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ఇన్చార్జి దాట్ల బుచ్చిబాబుపై ఇప్పటికే సానుకూల దృక్పథం ఉంది. అధికార పార్టీ శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల మీద ఆయన దిశ పత్రిక వేదికగా విరుచుకుపడుతున్నారు. అంతేగాక నియోజకవర్గంలో టీడీపీ కేడర్ బలంగా ఉంది. దీనికి తోడు శాసనమండలి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో నియోజకవర్గంలో పార్టీ మరింతగా పుంజుకుంది. నియోజకవర్గానికి చెందిన దళిత నాయకుడు మోకా ఆనంద సాగర్ నిత్యం జగన్ పై విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. బుచ్చిబాబు కూడా ఇదేం ఖర్మ కార్యక్రమం ద్వారా దూసుకుపోతున్నారు. ఎన్ని పొత్తులున్నా బుచ్చిబాబుకు సీటు ఖాయమని పార్టీ పెద్దలు అంటున్నారు.

పోలవరంలో వెంకట్రాజు టాప్

రాజమండ్రి జిల్లా పోలవరంలో ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మొన్నటి వరకు ఇదేం ఖర్మలో జగన్‌పై ప్రసంగాలు ఇచ్చి జనంలో భేష్ అనిపించుకొన్నారు. తాజాగా ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత సంబరాలు చేసుకుంటున్నారు. అంతేగాక ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమ నిర్వహణలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించారు. తాజాగా మరో వారంలో నర్లజర్లలో పెద్ద ఎత్తున పార్టీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అధికార పార్టీ శాసనసభ్యునిపై వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు.

జగ్గంపేటలో పెద్దాయన జోరు

కాకినాడ జిల్లా జగ్గంపేటలో పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ.. నియోజకవర్గంలో గట్టి ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో పెద్దాయన పాత్ర పోషిస్తున్న నెహ్రూ కూడా ముందంజలో ఉన్నారు. ఇక్కడ గతేడాది నుంచి పార్టీ పుంజుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నియోజకవర్గంలో తటస్తులు కూడా పార్టీకే అనుకూలంగా ఉన్నారనే ధీమా కలిగింది.

పిఠాపురం.. వర్మపరం

పిఠాపురంలో మాజీ శాసనసభ్యుడు వర్మ కూడా దూసుకుపోతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో వర్మ విశాఖ జిల్లా వెళ్లి ప్రచారం చేశారు. ప్రస్తుత ఫలితాల తర్వాత సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం ఇదేం ఖర్మ కార్యక్రమంలో బిజీ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed