Ap News: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం... ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసా?

by Disha Web Desk 16 |
Ap News: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం... ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసా?
X
  • 3 గ్రాడ్యుయేట్స్, 2 టీచర్స్, 3 స్థానిక సంస్థలకు ఎన్నికలు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు - 1,056,720
  • 1538 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు
  • ప్రతీ పోలింగ్ స్టేషన్ లో 100% వెబ్ కాస్టింగ్
  • 500 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. (రేపు) సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ , 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, అయితే ఐదు లోకల్ బాడీ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.


ఈ ఎన్నికలలో మొత్తం ఓటర్లు - 1,056,720మంది 1538 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఓటర్లు- 10 లక్షల 519, టీచర్స్ ఎమ్మెల్సీల ఓటర్లు- 55,842, లోకల్ బాడీ ఎమ్మెల్సీల ఓటర్లు -3,059 ఓటు హక్కు వినియోగించుకుంటారని.. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో 100% వెబ్ కాస్టింగ్, 500 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.


10 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటేయవచ్చని సూచించారు. ఇప్పటి వరకూ 77, 48,010 నగదు సీజ్ చేసినట్లు వెల్లడించారు. 1,02,819.05 లీటర్ల లిక్కర్ సీజ్ చేశామని.. 64 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి 75 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 7,380 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ అయినట్లు స్పష్టం చేశారు. అలాగే 7,266 మంది బైండోవర్లు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. సాయంత్రం నాలుగులోగా క్యూలో ఉన్నవారందిరికీ ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి 500 జంబో బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

బోగస్ ఓట్లపై చర్యలు తీసుకుంటాం

బోగస్ ఓట్లని చెబుతున్న వాటిని పరిశీలించి యూనివర్సిటీ సర్టిఫికెట్, అసెస్టేషన్ చేసి ఉందో లేదో పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఫేక్ సర్టిఫికెట్‌తో ఓటు హక్కు వినియోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రలోభాల పర్వంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని ఆయా జిల్లాల కలెక్టర్లకు విచారణకు పంపిస్తున్నట్లు తెలిపారు. బోగస్ ఓట్లపై వారం రోజుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.

సీపీఎం, టీడీపీ నుంచి ఫిర్యాదులు అందాయని, తిరుపతి అర్బన్ నుంచి మాత్రమే ఈ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. మిగతా ఎక్కడ నుంచి ఫిర్యాదులు అందలేదని, 663 పేర్లు బోగస్ ఓట్లని చంద్రబాబు నాయుడు పంపించినట్లు స్పష్టం చేశారు. 500 పేర్ల మీద ఇప్పటికే విచారణ చేసి ఈసీకి నివేదిక పంపించినట్లు తెలిపారు. మిగతా వాటి మీద కలెక్టర్ విచారణ చేసి నివేదిక అందజేస్తారని చెప్పారు.

అడ్రస్ తప్పని గుర్తించిన వారికి అర్హత ఉందా లేదా అనేది రిపోర్టు వచ్చిందని.. ఒకే అడ్రస్ మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు పరిశీలిస్తే వారంతా అదే ప్రాంతానికి చెందిన వారేనని గుర్తించినట్లు స్పష్టం చేశారు. అడ్రస్‌లు సరిగా ఫీడ్ చేయలేదని గుర్తించి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అడ్రస్‌లో లేని వారు.. చనిపోయిన వారికి సంబంధించి లిస్ట్ ఇప్పటికే పోలింగ్ స్టాఫ్‌కి పంపినట్లు తెలిపారు. వీరిపై విచారణ చేసి వీడియో గ్రాఫింగ్ తర్వాత మాత్రమే అనుమతి ఇస్తామన్నారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలో ఉండే అంశంపై నారా లోకేశ్ శనివారం అనుమతి కోరారని.. ఆయన రిక్వస్ట్ లెటర్‌ను ఎన్నికల సంఘానికి పంపించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

Next Story

Most Viewed