దబిడి దిబిడే: చంద్రబాబు అరెస్ట్‌తో రంగంలోకి బాలకృష్ణ... సిద్ధమవుతున్న బ్లూ ప్రింట్

by Disha Web Desk 21 |
దబిడి దిబిడే: చంద్రబాబు అరెస్ట్‌తో రంగంలోకి బాలకృష్ణ... సిద్ధమవుతున్న బ్లూ ప్రింట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీలో నందమూరి బాలకృష్ణ దూకుడు పెంచనున్నారా? పార్టీ అధినేత, బావ చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం.. అల్లుడు నారా లోకేశ్ యువగళానికి పరిమితం కావడంతో పార్టీని ముందుకు నడిపించేందుకు నందమూరి నట సింహం జూలు విదల్చనుందా? చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీపై విపరీతమైన సానుభూతి పెరిగింది. ఆ సానుభూతిని క్యాష్ చేసుకునేందుకు, చంద్రబాబును దోషిగా చూపించేందుకు వైసీపీ చేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు బాలయ్య రంగంలోకి దిగబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఇలాంటి తరుణంలో పార్టీకి అండగా నిలిచేందుకు సరైన నాయకత్వం అవసరం. అది నందమూరి వారసుడిగా బాలయ్య బాబేనని అంతా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బాలయ్య రంగంలోకి దిగారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమై భవిష్యత్ కార్యచరణపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. దీంతో ఇక నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో మరింత యాక్టివ్ కాబోతున్నారని ఇక ఏపీ రాజకీయాల్లో దబిడి దిబిడేనన్న ప్రచారం జరుగుతుంది.

ప్రజల్లోకి వెళ్లే యోచనలో బాలయ్య

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌కు వెళ్లడంతో హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వాటన్నింటిని రద్దు చేసుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్‌లతోపాటు మరికొందరు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబు జైల్లో ఉండటంతో భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో సమాలోచనలు చేశారు. వాట్ నెక్స్ట్ అనేదానిపై చర్చించారు. తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న చంద్రబాబు జైలుకు వెళ్లడం... యువగళ రధసారథి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజమహేంద్రవరంలో ఉండి తండ్రి అరెస్ట్ తదితర అంశాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బాలయ్య రాక అనివార్యం అయ్యింది. చంద్రబాబు కుటుంబానికి ప్రతీ ఒక్కరూ అండగా నిలబడేలా.... చంద్రబాబు రాష్ట్రానికి చేసిన సేవ, అక్రమ కేసులను ప్రజల్లో తీసుకెళ్లే అంశాలపై బాలకృష్ణ చర్చించినట్లు తెలుస్తోంది.

పార్టీ కోసం నేను సిద్ధం

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌, హౌస్ రిమాండ్ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే మరో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ ప్రభుత్వం. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసును తెరపైకి తీసుకువచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ వేసింది. చంద్రబాబును విచారించాలని కోరింది. అంటే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసు నుంచి బెయిల్‌పై విడుదలైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అనంతరం పుంగనూరు అల్లర్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఐటీ నోటీసులు,అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ కేసు, ఈ ఎస్ఐ స్కామ్ ఇలా అనేక కేసులు పెట్టి చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేసేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూనే ఇన్నర్ రింగ్ రోడ్ కేసును తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానిపై నందమూరి బాలకృష్ణ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్ కి మోరల్ గా సపోర్టు ఇవ్వాల్సిన సమయం ఆసన్నం అయిందని, పార్టీ తరపున ఏ కార్యక్రమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీనియర్ నేతలతో బాలకృష్ణ స్పష్టం చేశారని తెలుస్తోంది.

బ్లూప్రింట్ సిద్ధం చేయాలన్న బాలయ్య

నారా లోకేశ్ యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను లోకేశ్ జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి అరెస్ట్‌, ఇతరత్రా పరిణామాలపై లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. అనంతరం యువగళం పాదయాత్రను స్టార్ట్ చేస్తే చంద్రబాబు పాత్రను ఎవరు భర్తీ చేస్తారనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాత్రలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు తాను సిద్ధమని నందమూరి బాలకృష్ణ ప్రకటించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎక్కడైనా పర్యటించాల్సి వస్తే అందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని పార్టీ ముఖ్య నేతలతో బాలకృష్ణ అన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేయాలని సూచించారట. సో మెుత్తానికి నందమూరి వారసుడిగా బాలకృష్ణ పార్టీలో యాక్టివ్ కానున్నారు.

నేనొస్తున్నా..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలుకు తరలించడం వంటి పరిణామాలను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని నందమూరి బాలకృష్ణ హామీ ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్‌కు తరలించడాన్ని కొందరు తట్టుకోలేక పోయారని దాంతో గుండెపోటుతో మరణించడం, మరికొందరు వీరాభిమానులు బలవన్మరణాలకు పాల్పడ్డారని బాలకృష్ణ అన్నారు. ఈ విషాద ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబాలకు పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని బాలయ్య అన్నారు. త్వరలోనే ప్రతీ కుటుంబాన్ని తాను కలవబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటించారు. తన బావ చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్ వంటి ఘటనలు తట్టుకోలేక మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు. నేనున్నాను...మీ వద్దకు వస్తాను అని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed