సోలార్‌ భూములకు చట్టబద్ధమైన రక్షణ ఇవ్వాలి.. CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

by Dishafeatures2 |
సోలార్‌ భూములకు చట్టబద్ధమైన రక్షణ ఇవ్వాలి.. CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
X

దిశ, అనంతపురం: గాలి, సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు కోసం రైతుల నుంచి లీజు పేరుతో తీసుకుంటున్న భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అదే విధంగా లీజు ఏడాదికి కాకుండా నెల నెలా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున ఏర్పాటవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో "సోలార్‌, విండ్‌ పవర్‌ వరమా? శాపమా?" అన్న అంశంపై అనంతపురం నగరంలోని ఎన్జీవో హోంలో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు వి.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో ఏడాదిలో 300 రోజుల వరకు ఎండ బాగా ఉండటమే కాకుండా ఎత్తైన ప్రాంతం కావడంతో విద్యుత్‌ ఉత్పత్తికి ఇది అనువైన ప్రాంతమన్నారు. అందుకే ఈ ప్రాంతంలో పెద్దఎత్తున సౌర, గాలి విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు జరుగుతోందన్నారు. అయితే ఈ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల కోసమని సేకరిస్తున్న భూమి గతంలోలాగా కాకుండా లీజు పద్దతిలో పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టడం జరుగుతోందన్నారు. ఇలా ఏడాదికి రూ.30 వేలు మాత్రమే రైతులకు లీజు ఇస్తున్నారన్నారు. ఇది కేవలం ఒప్పందం ద్వారానే జరుగుతోందని చెప్పారు.

ఏదైనా సమస్య వచ్చి లీజు చెల్లించకపోతే రైతు అడగటానికి వీల్లేకుండా ఉన్నందున చట్టబద్ధమైన రక్షణను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ఐదు ఎకరాల విస్తీర్ణం అవసరమవుతుందని చెప్పారు. దీని ద్వారా 20 వేల నుంచి 25 వేల యూనిట్లు ఉత్పత్తి జరుగుతుందన్నారు. దీని వలన కంపెనీకి నెలకు ఆరేడు లక్షల ఆదాయం ఉంటుందని కంపెనీలు చూసే ఆడిటర్స్‌ చెబుతున్న లెక్కలని తెలిపారు. దీని ద్వారా ఏడాదికి ఒకటిన్నర కోటి రూపాయల వరకు ఆదాయం సమకూరుతోందన్నారు. అయితే రైతుకు ఎకరానికి లీజు కింద ఏడాది మొత్తానికి ఇస్తున్నది కేవలం రూ.30 వేలు మాత్రమేనని చెప్పారు. ఇది సరైంది కాదని నెలకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయాల్సిన అవసరముందని తెలిపారు. యూనిట్‌కు రూ.1.99 అవుతే సరిపోతుందని 'సెకీ' సంస్థ చెబుతోందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు చేసుకున్న ఒప్పందాల ప్రకారం అదాని సంస్థకు చెల్లిస్తున్నది రూ.2.49 అని వివరించారు. ఈ ధరకే చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్‌నివ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలకు రూ.7లకుపైగా యూనిట్‌కు ఇస్తున్నారని పేర్కొన్నారు. దీనికితోడు ట్రూఆఫ్‌ పేరుతో అదనపు బాదుడు వేస్తుండటంతో చిన్న,మధ్య తరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని చెప్పారు.

వీటికి రూ.2.49తోనే విద్యుత్‌ను అందివ్వాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా కాలనుగుణంగా విద్యుత్‌ ధరలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ సమీక్షించి ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై రైతుల్లోనూ, ప్రజల్లోనూ అవగాహన కల్పించి పోరాటాలకు సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జి.ఓబుళు మాట్లాడుతూ జిల్లాలో పెద్దఎత్తున పవన, గాలి విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతోందన్నారు. ఇప్పుడు ఇస్తున్న లీజు ఏ మాత్రం సరిపోదని, దీన్ని పెంచే విధంగా ఒత్తిడి పెంచాల్సిన అవసరముందన్నారు. జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ జిల్లాలో 3.16 లక్షల ఎకరాల భూములను సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం కేటాయించడం జరిగిందన్నారు. ఇంత పెద్దఎత్తున భూములను అదాని వంటి కంపెనీలకు ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయన్నారు. తద్వారా ఉపాధి కోల్పోపోతున్న వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలే సోలార్‌ పరిశ్రమల కిందపోతున్నాయన్నారు. అయితే ఆ ప్లాంట్లలో లభిస్తున్న ఉపాధి ఏమీ ఉండటం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సావిత్రి, ఒ.నల్లప్ప, బి.శ్రీనివాసులు, సిపిఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : వంగవీటి రంగాను హత్య చేసింది అప్పటి TDP నాయకత్వమే: మంత్రి గుడివాడ అమర్నాథ్

Next Story

Most Viewed