షర్మిలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన ఏపీ కాంగ్రెస్

by Disha Web Desk 3 |
షర్మిలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన ఏపీ కాంగ్రెస్
X

దిశ వెబ్ డిస్క్: వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన విషయం అందరికి సుపరిచితమే. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం పైన స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని ఆరోపించారు. అయితే షర్మిల కాంగ్రెస్స్ లో చేరినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టం ఏమి లేదని అయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అసలు భవితవ్యం లేదని.. అలాంటి పార్టీని అసలు లెక్కలోకి కూడా తీసుకోమని తేల్చి చెప్పారు. ఈ నేపధ్యంలో సజ్జల సంచలన వ్యాఖ్యలకు ధీటైన సమాధానం ఇచ్చారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ.

అధికారం ఎక్కడ చేజారిపోతుందో అనే భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన అధికార దాహాన్ని తీర్చుకునేందుకు తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకుని ప్రజల ముందుకు వచ్చాడని. అసత్యాలతో.. తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేశారని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని పదేపదే ప్రస్తావించే వైసీపీ నేతలు, అధినేత, నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఎందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై విచారణ జరిపించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి షర్మిల పార్టీ లోకి వచ్చారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నది వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరికని.. ఆ కోరికను నెరవేర్చేందుకు షర్మిల కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చెయ్యాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారని తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లోకి రావడంతో వైసీపీ నేతలకు, అధినేతకు వెన్నులో వణుకుపుడుతుందని.. అందుకే మేకపోతు గాంభీర్యాలను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ప్రజలు అవకాశం ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చామా అని బాధపడుతున్నారని పేర్కొన్నారు.



Next Story

Most Viewed