రెవెన్యూ లోటు భర్తీనా.. ప్రత్యేక సాయమా!

by Disha Web Desk 12 |
రెవెన్యూ లోటు భర్తీనా.. ప్రత్యేక సాయమా!
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సాయం కోరగానే కేంద్రం ఆగమేఘాలపై స్పందించింది. 2014–15కు సంబంధించి రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.10,641 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. సదరు జీవోలో అనేక మడత పేచీలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న సొమ్మును ప్రత్యేక సాయంగా పరిగణిస్తున్నందున ఇకపై కేంద్ర ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి నిధులు అడగడానికి వీల్లేదనే షరతులు విధించింది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం భవితవ్యం ఏమిటి ? ఎస్సీ ఎస్టీ జాతీయ ఫైనాన్స్​ కార్పొరేషన్ ద్వారా విడుదల చేయాల్సిన నిధుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వరా అని నిలదీస్తున్నారు. జీవో మొత్తం గందరగోళంగా ఉంది. దీనిపై ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే పరిస్థితి ఏమిటనే కోణంలో ఇది చర్చనీయాంశమైంది.

వాయిదాల్లో రూ.3,979 కోట్లు విడుదల

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జీవో లో తొమ్మిదేళ్ల నాటి రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ గ్రాంటును విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. నాడు రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుగా నిర్ధారించారు. దీన్ని కాగ్​ ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. రెండు మూడు వాయిదాల్లో సుమారు రూ.3,979 కోట్లు దాకా విడుదల చేసింది. తర్వాత దానిపై మళ్లీ మదింపు చేసి ఇక చెల్లించాల్సింది కేవలం రూ.139 కోట్లేనని వెల్లడించింది. రెవెన్యూలోటులో పీఆర్సీ చెల్లింపులు ఉన్నందున మొత్తం రూ.16 వేల కోట్లు ఇవ్వడానికి వీల్లేదని కేంద్రం తెగేసి చెప్పింది. దీనిపై నాడు చంద్రబాబు కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

భవిష్యత్తు అంధకారమే..

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు గురించి అడగ్గానే మళ్లీ లెక్కలేసి ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు జీవో ఇచ్చింది. జీవోలోని కింది పేరాల్లో మాత్రం ఇది ప్రత్యేక సాయంగా పేర్కొంది. అంటే ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ అనుకోవాలా అంటూ ఆర్థిక నిపుణులు అడుగుతున్నారు. పైగా మరో పేరాలో ఇకపై కేంద్ర ప్రాజెక్టులు, స్కీములకు సంబంధించి నిధులు అడగడానికి వీల్లేదనే షరతు విధించారు. దీనిపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి షరతులకు అంగీకరించి ఈ నిధులు తీసుకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరిస్తున్నారు.

ప్రశ్నార్థకంగా పోలవరం ప్రాజెక్టు..

జీవోలో ప్రస్తావించిన షరతులకు అంగీకరించడం వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమవుతుంది. సవరించిన అంచనా డీపీఆర్​ ప్రకారం రూ.55,656 కోట్లకు కేంద్రం అనుమతించకుండా మోకాలడ్డుతోంది. పునరావాసం, పరిహారానికే సుమారు రూ.28 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఈ షరతులకు అంగీకరిస్తే ప్రాజెక్టు భవితవ్యం ఏమిటనేది ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్నమొన్నటిదాకా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేది. కంటితుడుపుగా జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఇస్తుంటే బుందేల్​ఖండ్​ తరహా ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్రం పట్టుబట్టింది.

దీంతో ఆ ఇచ్చే అరకొర నిధులనూ నిలిపేసింది. ఇవిగాక ఎస్సీ ఎస్టీలకు ఎన్​ఎస్ ఎఫ్​డీసీ, ఎన్​టీఎఫ్​డీసీల ద్వారా స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి. వీటి నుంచి నిధులు నిలిపేస్తే వాళ్ల సంక్షేమానికి గండిపడినట్లే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవోలో పేర్కొన్న షరతులపై కేంద్రాన్ని నిలదీయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకుంటే రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed