కర్ణాటకలోని రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఆదుకుంటామని హామీ

by Disha Web Desk 21 |
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటకలో చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కూలీలు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడికి మెురుగైన వైద్యం అందించేలా చూస్తామని సీఎం వైఎస్ జగన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇకపోతే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కూలీలు పనుల నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్తుంటారు. వలస వెళ్లిన కూలీలు పండుగలకు సొంతూరు వచ్చి తిరి వెళ్తుంటారు. ఇటీవలే దసరా పండుగకు వచ్చిన వలస కూలీలు తిరిగి పనుల నిమిత్తం బెంగళూరుకు బయలుదేరారు. బుధవారం వేకువ జామున సుమోను బాడుగగకు తీసుకుని 15 మంది వలస కూలీలు బెంగళూరుకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆరుగురు, చికిత్సపొందుతూ మరోకరు మృతి చెందారు. మెుత్తం ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. మృతులంతా శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గోరంట్ల మండలంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story

Most Viewed