Tirupati: అడుగడుగునా నిరసన.. రెచ్చిపోయి బూతులు తిట్టిన డిప్యూటీ సీఎం

by Disha Web Desk 16 |
Tirupati: అడుగడుగునా నిరసన.. రెచ్చిపోయి బూతులు తిట్టిన డిప్యూటీ సీఎం
X

దిశ, తిరుపతి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో డిప్యూటీ నారాయణ స్వామికి నిరసన సెగ తగిలింది. చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం కురివికుప్పం పంచాయతీలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయితే నారాయణ స్వామిని స్థానికులు అడ్డుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నా పక్కా ఇల్లు మంజూరు కాలేదన్నారు. తమ గ్రామంలో మురుగునీటి కాలువలు లేవని.. తాగు నీటి సమస్య ఉండంటూ మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. ఇక తిమ్మిరెడ్డి కండ్రిగ ఆది ఆంధ్రవాడలో ఓ యువకుడు అయితే డిప్యూటీ సీఎం ఎదుటే ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో ఉద్యోగాల కోసం నెలకొన్న వివాదాల కారణంగా స్థానిక నాయకులు తనకు అన్యాయం చేశారంటూవాపోయారు. దీంతో అసహనానికి గురైన మంత్రి సమస్యలు ఉంటే స్థానికంగే పరిష్కరించుకునేలా స్థానిక నాయకులు పని చేయాలని ఆదేశించారు.

కురివి కుప్పంలో ఇలా...

కురివి కుప్పంలో మహిళలు మాట్లాడుతూ తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని తెలిపారు. వీధులను ఆధునీకరించాలని డిప్యూటీ సీఎంను కొందరు యువకులు కోరారు. దీంతో స్థానిక నేతలు కలగజేసుకొని వారితో వారించే ప్రయత్నం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్​అందలేదని ఓ విద్యార్థి మంత్రి దృష్టికి తసుకెళ్లారు. దీంతో కళాశాలలో నీ హాజరు తక్కువైనందువలనే పథకం వర్తించి ఉండదని డిప్యూటీ సీఎం సూచించి ముందుకు సాగారు. కురివి కుప్పం ఎస్సీ కాలనీలోనూ డిప్యూటీ సీఎం పర్యటించారు. ఈ క్రమంలో రెవెన్యూ పరమైన సమస్యను మంత్రికి స్థానికులు తెలిపారు. వీఆర్వో సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్వోపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సెలవు పెట్టి వెళ్లిపో అంటూ వీర్వోపై డిప్యూటీ సీఎం మండిపడ్డారు.

అడగడుగునా నిలదీత

మరోవైపు అడగడుగునా సమస్యలపై కాలనీ వాసులు ప్రశ్నిస్తున్న తరుణంలో తీవ్ర అసహనానికి గురైన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్థానిక నేతలను మందలించారు. ఎస్సీ కాలనీకి దారి, బస్సు, నీటి సౌకర్యంతో పాటు శ్మశాన వాటిక కల్పించాలని తీవ్రస్థాయిలో ప్రశ్నించిన యువకుడిపై ఉపముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. తాను ఎవరో తెలుసా అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నా టీడీపీ జెండాలు కట్టి ఏం చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో దూషించారు. దీంతో స్థానికులు డిప్యూటీ సీఎం‌ తీరుపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వచ్చి ఇప్పుడు ప్రశ్నించిన తమను దూషించడం ఎంతవరకు సబబని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed