చిరుత చిక్కింది....భక్తుల భద్రత విషయంలో రాజీ పడం: టీటీడీ చైర్మన్ భూమన

by Disha Web Desk 21 |
చిరుత చిక్కింది....భక్తుల భద్రత విషయంలో రాజీ పడం: టీటీడీ చైర్మన్ భూమన
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణకార రెడ్డి అన్నారు. భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బుధవారం అర్ధరాత్రి మరో చిరుత చిక్కిందని తెలిపారు. గురువారం ఉదయం చిరుత చిక్కిన బోను వద్దకు చేరుకున్న చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలల్లో వ్యవధిలో ఐదు చిరుతలను పట్టుకున్నట్లు తెలిపారు. భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పడానికి మరోక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. అటవీశాఖ అధికారులు అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఇద్దరు చిరుత పులి దాడికి గురైతే, అందులో ఒక పాప మరణించడం జరిగిందని గుర్తు చేశారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. కొన్ని రోజుల వరకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్న పిల్లల నడిచేందుకు అనుమతి నిరాకరించడం జరిగిందని స్పష్టం చేశారు. భక్తులకు భద్రతా సిబ్బంది తోడుగా ఇచ్చి అదనపు భద్రత కల్పిస్తూనే, బుధవారం నుండి అదనంగా భక్తులలో ఆత్మ స్థైర్యం నింపడానికి కర్రలు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed