చంద్రబాబుకు బిగ్ రిలీఫ్: మధ్యంతర బెయిల్ మంజూరు

by Disha Web Desk 21 |
చంద్రబాబుకు బిగ్ రిలీఫ్: మధ్యంతర బెయిల్ మంజూరు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యింది. నాలుగు వారాలపాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా కోర్టులో ప్రస్తావించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చంద్రబాబు ఆరోగ్య సమస్య లు దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాలు పాటు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. లక్షపూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 28కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అయితే చంద్రబాబు నాయుడు తీర్పు కాపీ విడుదల కావాల్సి ఉంది. సకాలంలో తీర్పు కాపీ, ఆదేశాలు జైలు అధికారులకు అందితే నేడు సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సోమవారంతో ముగిసిన వాదనలు

ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారం ముగిశాయి. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై 50 రోజులు అవుతుందని సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి పరీక్ష నిర్వహించడం, ఆరోగ్య సమస్యలపై దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరాన్ని వైద్యులు చెబుతున్నారని సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను సైతం న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఏఏపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆపరేషన్ ఇప్పటికిప్పుడే అవసరం అని చెప్పలేదని వాదించారు.ఇరువాదనలు విన్న న్యాయమూర్తి వాదనలు ముగిసినట్లు తెలిపారు. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే తాజాగా మంగళవారం తీర్పును వెల్లడించారు. నాలుగు వారాలపాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

52 రోజులుగా జైల్లోనే

ఇకపోతే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు 52 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సెప్టెంబర్ 9న స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును సీఐడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. సెప్టెంబర్ 10న చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అప్పటి నుంచి చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే స్కిన్ అలర్జీ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం చంద్రబాబు నాయుడుకు ఏసీ వసతిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబు నాయుడు ఉపశమనం పొందారు. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు కుడి కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Read More: బ్రేకింగ్.. సాయంత్రం నాలుగు గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదల

Next Story

Most Viewed