కర్ణాటక ఫలితంపై జోరుగా బెట్టింగ్.. కడప జిల్లాలో కోట్లలో పందాలు

by Disha Web Desk 9 |
కర్ణాటక ఫలితంపై జోరుగా బెట్టింగ్.. కడప జిల్లాలో కోట్లలో పందాలు
X

దిశ ప్రతినిధి, కడప: బెట్టింగ్ అంటే కడప, కడప అంటే బెట్టింగ్.. క్రికెట్ అయినా, ఎన్నికల ఫలితాలైనా సరే.. చివరకు ఎన్నికలప్పుడు ఏ పార్టీ టిక్కెట్ ఎవరికి వస్తుంది అన్నదానిపై కూడా బెట్టింగ్ కాయడం జిల్లాలో జోరుగా కనిపిస్తున్నది. ఇంతవరకు ఉమ్మడి కడప జిల్లాలోనో, లేక రాష్ట్రంలోనో జరిగే ఇలాంటి వాటిపై బెట్టింగ్ కాయడం ఒకెత్తయితే ఇప్పుడు తాజాగా పొరుగు రాష్ట్రంపై కూడా బెట్టింగ్ కాయడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో ఫలితాలపై ఉమ్మడి కడపలో రూ.కోట్లలో బెట్టింగ్ కాయడం చూస్తే బెట్టింగ్ పిచ్చి తలకెక్కినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాతో పాటు మదనపల్లిలో కూడా కర్ణాటక ఫలితాలపై ఉత్కంఠ చర్చలు సాగుతున్న తరుణంలో బెట్టింగ్ జోరు అదే స్థాయిలో సాగుతోంది.

కాంగ్రెస్‌పైనే కాస్తున్నారు

పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఎన్నికల పోలింగ్ బుధవారం ముగియడం, ఆ వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వేలు రావడం, ఆ సర్వేలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు వెల్లడి కావడంతో ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్‌పై‌నే ఎక్కువగా బెట్టింగ్ కాస్తున్నారు. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాల్లో 115 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని, దక్కవని పెద్ద ఎత్తున పందాలు సాగుతున్నాయి. అక్కడ ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ రావాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో కొందరు మ్యాజిక్ ఫిగర్ పైన, రెండు సీట్లతో కలిపి 115 సీట్లుపైన లక్షల రూపాయల్లో బెట్టింగ్ కాస్తున్నారు. మరికొందరైతే మ్యాజిక్ ఫిగర్ పైనా, మరికొందరు కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీ‌గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఒకటికి ఒకటి ప్రకారం బెట్టింగ్ సాగిస్తున్నారు. ఇలా రకరకాలుగా ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, మదనపల్లిలో ఎక్కువ స్థాయిలో బెట్టింగ్ కాయడం ఆసక్తికరంగా మారింది. గురువారం ఉదయం నుంచి బెట్టింగ్ రాయుళ్ళు ఫోన్లలోనే కాయ్ రాజా కాయ్ అంటూ కోట్ల రూపాయలు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పందేలు కుదుర్చుకున్నారు. కడప ప్రొద్దుటూరులలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం.

బెట్టింగ్‌లో అనుభవం ఉన్న వారే అధికం

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ముందు నుంచి బెట్టింగ్‌లో అనుభవం గడించిన వారే పందేలు కాస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కాసిన వారే ఎక్కువగా ఇప్పుడు బరిలో ఉన్నట్లు సమాచారం. వీరు కుదుర్చుకున్న పందెం మొత్తాలను మధ్యవర్తికి అందిస్తారు. వీరిలో ఎవరి పందెం నెగ్గితే వారికి ఆమొత్తాన్ని అందిస్తారు. ఇలా సాగుతున్న పందాలు శుక్రవారం కూడా కొనసాగనున్నట్లు సమాచారం.

ఎన్నికల సరళిపై కర్ణాటకకు ఫోన్లు

లక్షలకు లక్ష రూపాయలు బెట్టింగ్ కాసే పందెం రాయుళ్లు పందేలు కుదుర్చుకునే ముందు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీటికి తోడు కర్ణాటకలో, బెంగళూరులో తెలిసినవారు, రాజకీయాలతో సంబంధాలు ఉన్నవారు, రాజకీయ అవగాహన కలిగిన వారితో మాట్లాడి అక్కడి ఎన్నికల సరళికోసం వారికి ఫోన్లు చేస్తూ సమాచారం తెలుసుకుంటున్నారు. గతంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినవి ఏ మేరకు నిజమయ్యాయి. వారు చెప్పిన సీట్లకు అటు ఇటుగా ఎన్ని వచ్చాయి.

ఇప్పుడు కూడా కర్ణాటక ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు చెప్పారు, ఆ సీట్లు అటు ఇటు వస్తాయా? అంతకుమించి పెరుగుతాయా? అనే రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పడంతో పాటు 130 సీట్లు వరకు వస్తాయని కూడా కొన్ని సర్వేలు చెప్పాయి. అయితే అంతకుమించి కూడా 151 సీట్లు రావడంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పిదానికంటే ఎక్కువ రావచ్చు అని కొందరు ఊహిస్తూ115 సీట్లు వస్తాయని కొందరు,118 వరకూ వస్తాయని కూడా కొందరు బెట్టింగ్ కాస్తున్నారు. మరి కర్ణాటక ఫలితం బెట్టింగ్ రాయుళ్లలో ఎవరిని ముంచుతుందో ఎవరిని తేల్చుతుందో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి: హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి బిగ్ షాక్

Next Story