అసైన్డ్ భూముల కేసు: తీర్పు వెల్లడించే సమయంలో మళ్లీ పిటిషన్ వేయడం ఏంటి?

by Disha Web Desk 21 |
ap highcourt
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూముల జీవోపై సీఐడీ దాఖలు చేసిన కేసులో విచారణను హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇదేకేసు విషయంలో సీఐడీ తరపున న్యాయవాదులు రీ ఓపెనింగ్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని వాటిని దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది.కేసు రీఓపెన్‌కు అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్‌ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి కొన్ని ఆడియో ఫైల్స్‌ను అందించారు. మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో ఈనెల 17న అందజేస్తామని న్యాయమూర్తికి సీఐడీ తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే కేసులో ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని కోర్టులో వాదించారు. ఇప్పటికే వాదనలు పూర్తై, కేసు తీర్పు ఇవ్వనున్న తరుణంలో సీఐడీ మరో పిటిషన్‌ వేయడం తమకు అభ్యంతరకరంగా ఉందన్నారు. దీంతో ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.


Next Story