గుంటనక్కలు నిద్రలేచాయి.. ఏమరపాటుగా ఉంటే ఖతమే!

by Disha Web Desk 2 |
గుంటనక్కలు నిద్రలేచాయి.. ఏమరపాటుగా ఉంటే ఖతమే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు రాబోతున్నాయని గుంటనక్కలు నిద్రలేచాయని, చంద్రబాబు కొత్త హామీలతో పగటి వేషాలు వేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ...సీఎం జగన్ సంక్షేమ సంతకం చేసి నాలుగేళ్లు అయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగేళ్ల పాలనలో జగన్ అద్భుతాలు చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని చెప్పారు. జగన్ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు.

గుంటనక్కలు మేల్కున్నాయి....

వచ్చే ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని...దీంతో మళ్లీ గుంటనక్కలు నిద్రలేచాయని సజ్జల విమర్శించారు. కొత్త హామీలతో చంద్రబాబు పగటి వేషాలు వేస్తున్నారని...రాష్ట్రాన్ని నిలువుదోపిడి చేసేందుకు ఇంకో అవకాశం కావాలని ప్రజలను అడుగుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి చంద్రబాబు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని ఎద్దేవా చేశారు. చెప్పుకోవడానికి ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. వైనాట్ 175ను నిజం చేసేందుకు వైసీపీ శ్రేణులు కష్టపడాలని చెప్పారు. గుంట నక్కల ఎత్తులను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఏమరపాటుగా ఉంటే వెన్నుపోటే...

టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదని..దొంగదెబ్బ కొట్టి, మామను చంపి తెచ్చుకున్నారని సజ్జల రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబును మోసేందుకు ప్యాకేజ్ తీసుకున్న దత్తపుత్రుడు ఉన్నాడని పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పెద్ద యుద్దం అని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు పాలనను ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ప్రజలు చేసిన మేలు ఏం లేదని విమర్శించారు. ఇక, ఎన్నికల సమయంలో ప్రజలను భ్రమలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని...ఏమరపాటుగా ఉంటే వెన్నుపోట్లు, పక్కపోట్లు ఉంటాయని సజ్జల హెచ్చరించారు. వైసీపీ శ్రేణులు ఒక్కటిగా నిలబడి ప్రజల ఆశలను పూర్తి చేయడానికి కృషి చేయాలని చెప్పారు. వైసీపీకి ఉన్న ఆదరణకు జగన్ పథకాలు, ఆలోచన విధానమే కారణమని చెప్పారు.



Next Story

Most Viewed