AP: పెండింగ్ సీట్లపై కూటమిలో కొనసాగుతున్న గందరగోళం.. అమోమయంలో నాయకులు, కార్యకర్తలు

by Disha Web Desk 1 |
AP: పెండింగ్ సీట్లపై కూటమిలో కొనసాగుతున్న గందరగోళం.. అమోమయంలో నాయకులు, కార్యకర్తలు
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా కూటమిలో పెండింగ్ సీట్లపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీంతో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేనలో అనిశ్చితి నెలకొంది. దాదాపు 5 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ తమ అభ్యర్థుల ఇంకా ప్రకటించ లేదు. అదేవిధంగా ఒక ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులపై జనసేనాని కసరత్తు చేస్తున్నారు.

ఇక పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లపైనా ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీ నేతలు, కార్యకర్తలు అభ్యర్థులను త్వరగా ప్రకటించాలంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పెండింగ్ సీట్లను ప్రకటిస్తేనే.. బీజేపీ అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే, ఆ సీటు కోసం జనసేన కీలక నేత పోతిన మహేష్ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, అదే స్థానాన్ని ఇప్పటికే బీజేపీకి కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆ స్థానం నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ వీడటం లేదు. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ నుంచి జనసేనలో చేరిన బాలశౌరికి జనసేన పవన్ కల్యాణ్ ఎంపీ టికెట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే, అదే స్థానం నుంచి జనసేన తరఫున అనూహ్యంగా వంగవీటి రాధా పేరు తెర పైకి వచ్చింది. మరోవైపు అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలోనూ ఆయన పేరును పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా.. అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీల అధినేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.



Next Story

Most Viewed