TDP: కళ్యాణదుర్గం బరిలో ఎవరు?

by Disha Web Desk 16 |
TDP: కళ్యాణదుర్గం బరిలో ఎవరు?
X
  • ఎమ్మెల్యే టికెట్ కోసం నేతల పాట్లు
  • టీడీపీలో పోటాపోటీగా పాదయాత్రలు
  • అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు
  • కార్యకర్తల తరలింపునకు లక్షల రూపాయల ఖర్చు

దిశ, కళ్యాణదుర్గం: నారా లోకేశ్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగానే అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి సంఘీభావ పాదయాత్ర చేపట్టాయి. అయితే మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో టీడీపీ నేతలు ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుట బలబలాలు నిరూపించేందుకు ఇరు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. ఈ పాదయాత్రకు కార్యకర్తల్ని తరలించేందుకు టీడీపీ నాయకులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు అధికార వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దేశం నేతలు చేపట్టిన ఈ సంఘీభావ పాదయాత్రతో తెలుగుదేశంలో మరోసారి గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. పార్టీ కళ్యాణదుర్గం ఇన్‌చార్జి ఆదేశాలను పాటించకుండా కొందరు నేతలు వ్యతిరేకంగా పార్టీకి పనిచేస్తున్నారని కార్యకర్తల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా సద్దుమణగాలంటే టీడీపీ నేత నారా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని పలువురు కార్యకర్తలు పేర్కొంటున్నారు. అయితే ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్ కోసం ఉన్నం, ఉమావర్గం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. అయితే చివరికి కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ కోసం కార్యకర్తలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నారా చంద్రబాబు 2024 ఎన్నికల్లో ఎన్నికల బరిలోకి ఈ రెండు వర్గాలను కాదని మూడో వ్యక్తిని బరిలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు సొంత సామాజిక వర్గం కావడంతోనే కళ్యాణ్ దుర్గం టీడీపీ ఇన్‌చార్జి మాటలు పెడచెవిన పెడుతున్న మరో వర్గాన్ని ఆయన ఏమీ అనలేక మింగలేక కక్కలేక పోతున్నారని తెలిసింది. చివరకు ఈ గ్రూపు రాజకీయాలు ఎంతవరకు కొనసాగుతాయో వేచి చూడాలి.

టీడీపీ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ప్రజాబలంతో అశేష ప్రజావాహినితో సంఘీభావ పాదయాత్ర కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం, శెట్టూరు మండలం యాటకల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సుఖ సంతోషాలతో జీవించాలంటే చంద్రబాబు సారథ్యంలో లోకేష్ బాబు ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజా సమక్షంలో ప్రజా ఆశీస్సులతో సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. నియోజకవర్గంలోని అశేష కార్యకర్తలు, నాయకులు సంఘీభావ పాదయాత్రలు పాల్గొని నూతన ఉత్తేజంతో ముందుకు సాగారు. మరొక వర్గం హనుమంతరావు చౌదరి ఆధ్వర్యంలో కూడా అశేష జనవాహినితో సంఘీభావ యాత్రను విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి : Kadapa: టీడీపీ నుంచి ఇద్దరు సస్పెండ్


Next Story