TulasiReddy: అదానీ ఆస్తుల అక్రమాలపై జేపీసీతో విచారణ చేపట్టాలి

by Disha Web Desk 16 |
TulasiReddy: అదానీ ఆస్తుల అక్రమాలపై జేపీసీతో విచారణ చేపట్టాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు మిత్రుడైన గౌతం అదానీ కంపెనీల అవకతవకలపై జేపీసీతో గానీ, సుప్రీంకోర్టు పర్యవేక్షణతో గాని విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. అదానీ అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు విచారణకు డిమాండ్ చేస్తుంటే మోదీ ప్రభుత్వం విచారణకు ఆదేశించకుండా పారిపోవడం శోచనీయమన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లెలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మారిషన్, బహుమాన్, వర్జిన్ ఐలాండ్ ట్యాక్స్ హెవెన్ దేశాల్లో అదానీ సోదరులు బోగస్ సెల్ కంపెనీలు పెట్టారని ఆరోపించారు. నల్ల డబ్బులను వాటిలో పెట్టి అక్కడి నుండి స్టాక్ మార్కెట్లో పెట్టి అదానీ కంపెనీల షేర్ల విలువ అనూహ్యంగా పెంచారని ఆరోపించారు.

అదానీ కంపెనీల లెక్కల పద్దుల్లో మోసాలు జరిగాయని, మార్చి 2022 నాటికి అదానీ కంపెనీల అప్పు రూ 2.20 లక్షల కోట్లు అని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాన్ని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ 2023 జనవరిలో నివేదిక బహిర్గతం చేసిందని గుర్తు చేశారు. ఈ నివేదిక బహిర్గతం అయిన 10 రోజుల్లోనే అదానీ కంపెనీ షేర్ల విలువ దాదాపు 10 లక్షల కోట్లు పడి పోయిందని స్పష్టం చేశారు. ఎల్ఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదానీ కంపెనీల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. అదానీ కంపెనీల దెబ్బ తింటే ఎల్ఐసితో పాటు మిగిలిన బ్యాంకు డిపాజిటర్లు కూడా పూర్తిగా నష్టపోతారని చెప్పారు. గతంలో కూడా హర్షద్ మోహత లాంటి కంపెనీలు అవకతవకలకు పాల్పడినప్పుడు జాయింట్ పార్లమెంటు కమిటీలు విచారించినట్లు తులసిరెడ్డి గుర్తు చేశారు.


Next Story

Most Viewed