కౌంటర్ దాఖలు చేయండి.. కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

by Dishafeatures2 |
కౌంటర్ దాఖలు చేయండి.. కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది. ఇదే సందర్భంలో ఈ రిజర్వేషన్ల అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఇకపోతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం ఇచ్చిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్‌ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో అప్పట్లో రిజర్వేషన్లు ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే 10శాతం రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు విచారణ ముగిసిన నేపథ్యంలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవది స్పందిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు వెల్లడించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.


Next Story