నా స్వప్న లోకానికి ఆయనే రారాజు

 ఎప్పుడు టీవీల్లో బయోపిక్ లు చూడటమే తప్ప మన కథ ఏంటీ ? అనే ఆలోచన తక్కువ నాదీ ఒక కథే కదా ఆ బ్రహ్మదేవుడు రాసుకున్న కథల్లో నా కథ ఒకటుంది. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆనందాలు వీటన్నింటి కలయికనే జీవితం.. నాజీవితాన్ని నేను రాసుకోగలనా.. ? అప్పుడే అనుకోని అతిథిలా వచ్చింది అవకాశం చెప్పుకోవడానికి ఏం లేక పోయినా రాసుకోవడానికి బాగుంటుంది కదా. అందుకే అక్షరంతో రూపమిస్తున్నా చదువుతారో చదివి చెలిస్తారో.. దిశ, కథా […]

Update: 2021-04-15 21:55 GMT

ఎప్పుడు టీవీల్లో బయోపిక్ లు చూడటమే తప్ప మన కథ ఏంటీ ? అనే ఆలోచన తక్కువ నాదీ ఒక కథే కదా ఆ బ్రహ్మదేవుడు రాసుకున్న కథల్లో నా కథ ఒకటుంది. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆనందాలు వీటన్నింటి కలయికనే జీవితం.. నాజీవితాన్ని నేను రాసుకోగలనా.. ? అప్పుడే అనుకోని అతిథిలా వచ్చింది అవకాశం చెప్పుకోవడానికి ఏం లేక పోయినా రాసుకోవడానికి బాగుంటుంది కదా. అందుకే అక్షరంతో రూపమిస్తున్నా చదువుతారో చదివి చెలిస్తారో..

దిశ, కథా స్రవంతి : జీవితం ఎన్నో కలలు ఆశలతో మొదలవుతుంది. నాకు ఓ కల ఉంది. బాగా చదువు కోవాలి ఇంగ్లీష్ లో అనార్గలంగా మాట్లాడాలని. కానీ నేను పుట్టాక వచ్చిన పేదరికమో, పుట్టకముందు ఉన్న పేదరికమో తెలియదుకానీ నా కలలను కారుచీకట్లతో కమ్మేసింది. అమ్మ, నాన్న నాకు ఇద్దరు చెల్లేళ్లు. మాది చాలా పేద కుటుంబం . దీంతో నన్ను చదువుకు దూరం చేసి ఇంటి పనులు పొలం పనుల వైపు మొగ్గు చూపేలా చేశారు నా తల్లి దండ్రులు.

నాకు చదువుకునే వయసొచ్చినా నన్ను అమ్మనాన్న పాఠశాలకు పంపాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు మాత్రం చదువంటే చాలా ఇష్టం. లేని వాళ్లకు చదువు మీద ఇంత ప్రేమ ఉండటం వారి జీవితానికి శాపం లాంటిదే. కానీ ఆ ప్రేమ వెనకాల చదువుతో మా జీవితాలు బాగుపడతాయనే స్వార్థం కూడా ఉంటుంది. అలాంటి స్వార్థమే నాది. కానీ ఆలోచనలకు కూడా నా పేదరికం అడ్డొచ్చింది. అలా తలవడం తప్పని చెప్పింది. ఇక అప్పటి నుంచి చదువు పై నా ఆశని వదిలేశా. కానీ నాపై ఓ బాధ్యత ఉంది నా చెల్లెళ్లను మాత్రం ఖచ్చితంగా చదివించాలని. దాని కోసం మా అమ్మవాళ్లని ఎప్పుడూ బతిమిలాడే దాన్ని చెల్లేళ్లను చదివించండని. వారు ఒప్పుకోలేదు కాని కొన్ని రోజులకు అమ్మ నాన్న కాస్త మంచిగా జీతం ఇచ్చే కంపెనీలో చేరారు. అప్పటి నుంచి కొంచెం కొంచెంగా మా జీవితాలు మారాయి. నా బలవతంతో చెల్లెళ్లను పాఠశాలలో జాయిన్ చేశారు. ఎంత ప్రభుత్వ పాఠశాలైనా కొద్దో గొప్పో డబ్బులు పెట్టాల్సి వచ్చేది. వాళ్లు మాత్రం బాగా చదివేవారు. ఇంటికొచ్చి ఇంగ్లీష్ లో బాగా మాట్లాడే వారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా సార్లు వాళ్లతో మాట్లాడాలనిపించేది. ఒకసారి ప్రయత్నించా కానీ నా మాటలకు వాళ్లిద్దరూ నవ్వడం మొదలు పెట్టారు అంతే.. అప్పటి నుంచి వారితో మాట్లాడడానికి ప్రయత్నించలేదు.

అందరిలానే కొన్నాళ్లకు నాకు పెళ్లి చేశారు. కానీ నేనేం బలవతంగా పెళ్లికి ఒప్పుకోలేదు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్లయ్యేటప్పటికి మాకుటుంబం కాస్త స్థిరపడింది. అందుకే నన్ను ఓ ప్రైవేటు టీచర్ గా ఉద్యోగం చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. నాభర్త ఎప్పుడు నన్ను చదువురానిదానిలా చూడలేదు.. చదువు పట్ల నాకున్న ఇష్టాన్ని చూశాడు. ఎంతైనా టీచర్ కదా. రోజు ఇంటికొచ్చాక నాతో కావాలనే ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు. నాకు మాట్లాడలంటే భయం మళ్లీ ఆయన కూడా నన్ను చూసి నవ్వుతారేమోనని. కొన్ని రోజులతర్వాత ఆ భయం పోయి మెల్లి మెల్లిగా మాట్లాడటం స్టార్ట్ చేశా అప్పటి నుంచి నాప్రతి అడుగులో ఆయన తోడు నాతో ఉంది. నేను నమ్మలేనంత తొందరగా చదవడం, రాయడం నేర్చుకున్నా. మరీ… ఆశ్చర్యపోవాల్సిందేటంటే ఇంగ్లీష్ లో చాలా బాగా మాట్లాడటం మొదలు పెట్టాను. దానికోసం నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు మరి. అలా నాభర్త నాకు అన్నీ ఇచ్చాడు .

ఆయనిచ్చిన భరోసాతోనే నాలా చదవాలనే కోరికా ఉన్నా చదువుకు దూరమైన వాళ్లకు ఫ్రీ గా ట్యూషన్ చెప్పడం ప్రారంభిచా నాజీవితంలో నాకు ఇదో పెద్ద విజయం. ఐదుగురు మాత్రమే వచ్చే నాట్యూషన్ క్లాస్ కి ఇప్పుడు 50 మందిదాక వస్తన్నారు. కానీ నాకు అనుకోకుండా ఓ రోజు ఒక ప్రశ్న ఎదురైంది. నీకు మీ అమ్మనాన్న, నీ పిల్లలు, భర్త వీరిలో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తావని. దానికి నేను కొంచెం కూడా తడబడలేదు. ఒకటే జవాబు ఇచ్చా.. అమ్మనాన్నలు వయసొచ్చే దాక చూసి అత్తారింటికి పంపిస్తారు. పిల్లలు వయసుమళ్లేదాకే మనతో ఉంటారు. జీవితాతం పక్కనే ఉండేది జీవిత భాగస్వామే అలా జీవితాతం నాతో ఉండే నాభర్తకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని. అంతే కదా నా కలను సాకారం చేసి నాజీవితానికో గమ్యం చూపిన నాభర్తకు మొదటి ప్రాధాన్యత నివ్వడం నాకు సంతృప్తినిచ్చింది. నా జీవితానికో గమ్యం చూపిన నా భర్తే నా రారాజు

జె. సమత

Tags:    

Similar News