‘గ్రేటర్’ రెడీ టు ఫైట్!

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ ఎన్నికలకు టీఆర్​ఎస్​ పక్కా ప్లాన్​తో పావులు కదుపుతోంది.. దీపావళి తర్వాత నోటిఫికేషన్​ విడుదల, వచ్చేనెల మొదటి వారంలో ఎన్నికల నిర్వహణ పూర్తి అయ్యేలా కదులుతోంది.. పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా అధినేత పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఏదిఏమైనా అధికార పార్టీ రాజకీయ చతురతను మిగతా పార్టీలు ఎలా అంచనా వేస్తాయో.. గ్రేటర్​ ఎన్నికలపై ఎలా ముందుకు కదులుతాయో వేచి చూడాలి మరి..! ముందుగా ఊహించినట్టే డిసెంబర్‌లోనే ఎన్నికల తంతు పూర్తి చేసేందుకు ఎన్నికల […]

Update: 2020-11-12 14:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ ఎన్నికలకు టీఆర్​ఎస్​ పక్కా ప్లాన్​తో పావులు కదుపుతోంది.. దీపావళి తర్వాత నోటిఫికేషన్​ విడుదల, వచ్చేనెల మొదటి వారంలో ఎన్నికల నిర్వహణ పూర్తి అయ్యేలా కదులుతోంది.. పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా అధినేత పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఏదిఏమైనా అధికార పార్టీ రాజకీయ చతురతను మిగతా పార్టీలు ఎలా అంచనా వేస్తాయో.. గ్రేటర్​ ఎన్నికలపై ఎలా ముందుకు కదులుతాయో వేచి చూడాలి మరి..!

ముందుగా ఊహించినట్టే డిసెంబర్‌లోనే ఎన్నికల తంతు పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం, ప్రభుత్వం సిద్ధమయ్యాయి. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించేందుకు స్పష్టమైన సంకే తాలు వెలువడ్డాయి. ఇప్పటికే గుర్తింపు పొం దిన 11 రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమై, అభిప్రాయాలను సేకరించింది. ఓటర్ల జాబితా ముసాయిదాతో పాటు పోలింగ్ కేంద్రాలు, ఇతర అంశాలపైనా ఆయా పార్టీలతో చర్చించింది. ఎస్‌ఈసీ భేటీ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. దీపావళి పండుగ తర్వాత ఈ నెల 16 నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలై రెండు వారాల్లో అంతా ముగియనుంది. నోటిఫికేషన్ అమల్లో ఉండగానే ప్రతిపక్షాలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేసుకోవడం వంటివి సమర్థవంతంగా చేసుకోవడం కష్టమైన పని. ఇదే అదనుగా మళ్లీ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునే వ్యూహంలో అధికార పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది.

ఉక్కిరిబిక్కిరిలో ప్రతిపక్షాలు

రాష్ట్రంలో అంతటా పండుగ వాతావారణ నెలకొంది. వరుసగా రెండు రోజుల సెలవులు ముగియగానే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. సుమారు 15 రోజుల్లోపు ఎన్నిక లు పూర్తి కానున్నాయి. అయితే ఇప్పటి వరకూ రాష్ట్రం లోని రాజకీయ పార్టీలేవీ తమ అభ్యర్థులను నికరంగా ఖరారు చేయలేదు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారోననే అంశం చుట్టే ఆయా పార్టీలను, రాజకీయ పార్టీలను తిప్పడంలో అధికార పక్షం సఫలీకృతమైంది. డిసెంబ ర్‌లోనా? జనవరిలోనా.. అన్న మీమాంసలోనే పార్టీలు ఉండిపోయాయి. మరో వైపు ఎన్నికల సంఘం తన పనితాను చేసుకుపోతుంది. ఈ నెలలో తుది జాబితాను ప్రకటించనుంది. కరోనా, వరదల సమస్యలపై ప్రభుత్వా న్ని నిలదీయడంలో, ప్రజల తరపున మాట్లాడే కార్యక్రమాల్లో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు బిజీగా గడుపుతున్నాయి. ఇంతలోనే అనుకోకుండా వస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ ఆయా పార్టీలకు ఆలోచించుకునే సమయం ఇవ్వడం లేదు. 150 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన రాజకీయ పార్టీ ఏదీ లేదనే చెప్పాలి. టీఆర్ఎస్‌తో సమానంగా ఇతర పార్టీలేవీ వెంటనే తమ అభ్యర్థులను ప్రకటించే స్థాయిలో లేవు. చివరి నిమిషంలో హడావిడిగా ఎన్నికల్లో కాలుమోపి పరాజయం పాలయ్యే పరిణామాలే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. నోటిఫికేషన్ అమల్లో ఉండగానే గ్రౌండ్ వర్క్ ఎలా చేసుకోవాలి, అభ్యర్థులను ఎంపిక, నాయకు లు, కార్యకర్తలను ప్రచారంలో పాల్గొనేలా చేసుకోవడం, ఓటర్లను తమ వైపు ఆకర్షించే పనులు చేపట్టడం ఇప్పుడు కత్తి మీద సాముగా మారింది. వార్డుల్లో పట్టు సంపాదించకుండానే అభ్యర్థులు బరిలో దిగడం ఇప్పుడు ఆయా పార్టీలకు ప్రధాన సమస్యగా మారనుంది.

కలిసొచ్చేది అధికార పార్టీకే..

ప్రతిపక్షాలు ఇబ్బందుల్లో ఉండగానే తమ పని పూర్తి చేసుకోవాలన్న ధృడ నిశ్చయంతో అధికార పార్టీ కనిపిస్తోంది. వరద బాధితులు, వరద సాయం సందర్భాల్లో అప్రతిష్ట పాలైన టీఆర్ఎస్ ఆ ప్రభావం ఎన్నికల్లో పడకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. తమ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లుగా మార్చుకునే అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వకుండా ఎన్నికలను పూర్తి చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రజలు ఓ వైపు ఇబ్బందుల్లో ఉండగా.. నగరంలోని ప్రధాన సమస్యలను అధికార పార్టీపై వ్యతిరేకతగా మార్చడంలో కావాల్సినంత సమయాన్ని ప్రతిపక్షాల చేతుల్లో పెట్టదలుచుకోలేదు. అధికార పార్టీగా తమకున్న వెసులుబాటును సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సంసిద్ధతను తెలపడంతో ఎస్‌ఈసీ షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎస్‌ఈసీ నిర్ణయమే అయినా, అధికార పక్షానికి తెలియకుండా నిర్వహించే అవకాశమే లేదు. సరిగ్గా ఇదే విషయాన్ని టీఆర్ఎస్ తన గెలుపు అస్త్రంగా మలుచుకుంది. గ్రేటర్‌లో అందరి కార్పొరేటర్లపై అంతర్గత సర్వే పూర్తి చేసి, పద్దతి మార్చుకోవాల్సిన వారికి హెచ్చరికలు కూడా వెళ్లాయి. ఇప్పటికే 150 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల పూర్తి స్థాయి జాబితాతో ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. నోటిఫికేషన్ అనంతరం పేర్లు ప్రకటించడం ఒక రివాజు మాత్రమేనని తెలుస్తోంది. చివరి నిమిషంలో స్థానికంగా వచ్చే సమస్యల కారణంగా మార్చాల్సి వచ్చినా అంతా రంగం సిద్ధంగా ఉంది. ఎన్నికలకు సంబంధించిన ప్రభుత్వ విభాగం పనులే బయటకు కనిపిస్తుండగా.. టీఆర్ఎస్ ఎక్కడా అటువైపు అడుగులు వేస్తున్నట్టు కనిపించకుండా జాగ్రతలు తీసుకుంది. గ్రేటర్ ఎలక్షన్స్‌కు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ చాప కింద నీరులా తన వ్యూహాలను అమలు చేయగలిగింది. ఇతర పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయకముందే.. నోటిఫికేషన్ విడుదల చేసిన గంటల వ్యవధిలో జాబితా ప్రకటించేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News