ప్రాణుల నడుమ ప్రాణాలతో గోస

ఉన్నత విద్యతో ఉద్యోగాలు పొందాలనుకున్న ఆ విద్యార్థులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని చదువుతున్నారు.

Update: 2022-07-07 12:06 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉన్నత విద్యతో ఉద్యోగాలు పొందాలనుకున్న ఆ విద్యార్థులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని చదువుతున్నారు. వీరంతా ఏ అడవిలో చదువుకోవడం లేదు. జనారణ్యంలో ఉన్నా వారు పుస్తకాలతో కుస్తీ పడడం కంటే హాస్టల్ రూంకు చేరితే చాలనుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. సాక్షాత్తు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల దీనస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉందనే చెప్పాలి. విష పూరీతమైన జీవాలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి తయారైంది.

ఏటా ఇదే తంతు...

కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీ విద్యార్థులు నిత్యం భయం నడుమే జీవనం సాగిస్తున్నారు. ప్రతి వేసవిలో ఇక్కడ మంటలు చెలరేగడం కామన్ గా మారింది. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఫైర్ ఇంజన్లు ఇక్కడ వాలిపోవల్సిందే. మంటలు పూర్తిగా ఆరిపోయే వరకూ ఎస్​యూ విద్యార్థులు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో రోజులు గడుపుతుంటారు. విశ్వ విద్యాలయం చుట్టూ ఉన్న చెట్లు, గుట్టల్లో మంటలు చెలరేగడం సర్వ సాధారణంగా తయారైంది.


ఇకపోతే ఎస్​యూలో స్టూడెంట్స్ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఎలుగుబంట్లు వీరి ధైర్యానికి సవాల్ విసురుతున్నాయనే చెప్పాలి. రాత్రిపూట ఎలుగుబంట్ల అరుపులతో ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి గజగజ వణికిపోతున్నారు. తెల్లవార్లు ఇదే భయానక పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గత మార్చి 12వ తేది నుండి మూడు రోజుల పాటు ఎలుగుబంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ ను భయపెడుతోంది.. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగి దానిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా మరోసారి బుధవారం రాత్రి నుండి ఎలుగుబంటి శాతవాహనలో హల్ చల్ చేస్తోంది. మరోసారి స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

సాయంత్రం నుండి గజగజ

ఏ కాలంలో అయినా ఈ యూనివర్సిటీలో ఉండే విద్యార్థులు సాయంత్రం అయిందంటే చాలు గజగజ వణుకుతున్నారు. చీకటి పడిందంటే ఎటువైపు నుండి ఏ వన్యప్రాణి వస్తుందోనని కలత చెందుతున్నారు. రెండు రోజుల క్రితం పాము కాటుకు గురై ఓ విద్యార్థి ఆసుపత్రి పాలయ్యారు. సాయంత్రం5 గంటలు అయిందంటే బయటకు రావద్దని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. లైబ్రరీకి వెళ్లడం కూడా ఇబ్బందిగా తయారైందని వాపోతున్నారు. అసలే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయిన ఈ సమయంలో వన్యప్రాణుల భయంతో హాస్టల్ నుండి బయటకు వెళ్లలేక పోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో యూనివర్సిటీ యంత్రాంగం కూడా హాస్టల్ కే పరిమితం కావాలని చెబుతుందని, దీంతో తాము ఎలా ప్రిపేర్ కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సేప్టీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్​ చేస్తున్నారు.

వాకర్స్​కు నో ఎంట్రీ: మల్లేశం, వీసీ

ఎలుగుబంటి తిరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఆవరణలో కొద్ది రోజుల పాటు వాకర్స్ కు అనుమతి ఇవ్వం. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కెమెరాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల తరువాత విద్యార్థులు ఎవరు బయటకు రావొద్దు. గుంపులు,గుంపులుగా విద్యార్థులు తరగతి గదులకు వెళ్లాలి. పరీక్షలను దృష్టి లో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. రెస్క్యూ టీమ్ ఎలుగుబంటిని పట్టుకునే వరకూ యూనివర్సిటీలో వసతి కల్పిస్తాం. ఫారెస్ట్ అధికారుల సూచనతో యూనివర్సిటీ హాలిడేస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.

Tags:    

Similar News