3 నుంచి 9 శాతం పెరిగిన ఇళ్ల ధరలు!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్థిరాస్థి రంగంలో వేగంగా మార్పు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రతికూల పరిస్థితులు,

Update: 2022-07-07 13:12 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్థిరాస్థి రంగంలో వేగంగా మార్పు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రతికూల పరిస్థితులు, వివిధ సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత భారత్‌లోని ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ రేట్లు పెరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇంటి యజమానుల నుంచి డిమాండ్ పెరగడం, అనుకూలమైన వడ్డీ రేట్లు, వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వంటి కారణాలతో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది గత ఏడేళ్లలో అత్యధికమని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో గతేడాది కంటే ఈసారి 3-9 శాతం ప్రాపర్టీ ధరలు పెరిగాయి.

అత్యధికంగా ముంబై, బెంగళూరు నగరాల్లో 9 శాతం పెరిగాయి. ఢిల్లీ, పూణెలలో 7 శాతం పెరిగాయి. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఇళ్ల కొనుగోళ్లు పుంజుకున్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఆందోళనలు ఉన్నప్పటికీ ప్రాపర్టీ మార్కెట్ సానుకూలంగా ఉంది. కానీ, ఇటీవల వడ్డీ రేట్లు పెరగడం కొంత ప్రభావం చూపుతున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. నివేదిక ప్రకారం, జూన్ నెలలో ప్రధాన ఎనిమిది నగరాల్లో మొత్తం 1,58,705 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2013 ద్వితీయార్థం తర్వాత నుంచి అత్యధికమని, అలాగే, వార్షిక పరంగా 60 శాతం వృద్ధి అని నివేదిక పేర్కొంది.

Similar News