అన్నదమ్ములిద్దరిని సజీవ దహనం చేసిన పాలు

దిశ, ఏపీ బ్యూరో : కొడుకులు ఇద్దరినీ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు.

Update: 2022-06-24 11:51 GMT

దిశ, ఏపీ బ్యూరో : కొడుకులు ఇద్దరినీ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. కాయ కష్టం చేసి తమ స్థోమతకు మించి ఖర్చు చేసి పెద్ద చదువులు చదివించారు. కొడుకులు ఇద్దరూ చేతికందివచ్చారు. మరికొన్ని రోజుల్లో పెద్ద కుమారుడు ఉద్యోగం కూడా సాధించే ప్రయత్నాల్లో ఉన్నాడు. తమ కష్టం ఫలించిందని తమ బిడ్డ ఉద్యోగం చేసి తమను సాకుతాడని ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొడుకులు ఇద్దరినీ చూసి మురిసిపోతున్నారు. ఆ చక్కటి కుంటుంబాన్ని చూసి ఎవరి కన్నుకుట్టిందో ఏమో కొడుకులు ఇద్దరినీ తల్లిదండ్రులకు దూరం చేసింది. విద్యుత్ షాక్ అన్నదములిద్దరినీ బలి తీసుకుంది. ఈ హృదయ విదారకర ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే దేవులపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు వల్లేపల్లి నాగేంద్ర (21), వల్లేపల్లి ఫణీంద్ర (19) పాలు తెచ్చేందుకు పొలం వద్దకు బైక్ పై బయల్దేరారు. మార్గమధ్యంలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి బైక్ పై పడింది. దీంతో ఒక్కసారిగా బైక్‌కు మంటలు అంటుకోవడంతో బైక్ పై ఉన్న అన్నదమ్ములిద్దరూ మంటలు అంటుకుని సజీవదహనమయ్యారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు కుమారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందొచ్చిన కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల విలపిస్తున్న తీరు అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. ఇకపోతే మృతి చెందిన వారిలో నాగేంద్ర బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, ఫణీంద్ర ఇంటర్ సెకండియర్ పూర్తి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే దీనికి కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News