ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కారు తీపికబురు

గత నెలలో అమలు చేసినట్టుగానే ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లింపును ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నది.

Update: 2024-04-30 01:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత నెలలో అమలు చేసినట్టుగానే ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లింపును ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నది. మిగతా అవసరాలన్నింటినీ పక్కన పెట్టి ఫస్ట్ తారీఖునే జీతాలు చెల్లించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం కావాల్సిన నిధులను కూడా దాదాపుగా సమీకరించుకున్నది. అయితే ఫస్ట్ తారీఖు ‘మే డే’ సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో రెండో తేదీ ఉదయాన్నే ఎంప్లాయీస్, పెన్షనర్ల అకౌంట్లలోకి డబ్బులు జమ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. సెలవు లేనట్టయితే ఒకటో తేదీనే జమ అయ్యేవని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. గత నెలలో తొలుత ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలను జమ చేసి ఆ తర్వాత ఒకటి రెండు రోజులకు రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ల పేమెంట్ చేసింది. కానీ ఈసారి వారందరికీ ఒకేసారి పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది.

ఫస్ట్ ప్రయారిటీగా జీతాల చెల్లింపు

రెండు మూడు నెలలుగా ప్రభుత్వం అన్ని అవసరాలనూ పక్కనపెట్టి, ఫస్ట్ తారీఖున ఎంప్లాయీస్‌కు వేతనాలు ఇచ్చే విధానానానికి శ్రీకారం చుట్టింది. వారి నుంచి ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి. గత ప్రభుత్వంలో శాలరీస్ ఏ తేదీన వస్తాయో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఎదురుచూస్తూ ఉండేవారు. ఉద్యోగుల్లోని అసంతృప్తిని, వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీతాలు మొదటి రోజునే పడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. గత రెండు నెలలుగా ఉద్యోగుల శాలరీల విషయంలో సక్సెస్ అయినా రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల పేమెంట్ విషయంలో మాత్రం రెండు మూడు రోజులు ఆలస్యమైంది. రాష్ట్ర ఆర్థిక వనరుల నిర్వహణలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పెషల్ ఫోకస్ పెట్టి తేడాల్లేకుండా వీరందరికీ ఒకేసారి జమ అయ్యేలా అధికారులను ఆదేశించారు.

జూన్ నుంచి పకడ్బందీగా..

ఆ ప్లాన్ ప్రకారం ఈ నెల నుంచి ఎంప్లాయిస్‌తో పాటే పెన్షనర్లకు కూడా అదే టైమ్‌కు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా రంగం సిద్ధమైంది. గ్రౌండ్ లెవల్‌లో మొత్తం కసరత్తు చేసినా ‘మే డే’ కారణంగా బ్యాంకులకు సెలవు రావడంతో లెక్క తప్పింది. ఒక రోజు ఆలస్యమైనా మే రెండో తేదీన అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శాలరీలు, ఇటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి చెల్లించేందుకు ఆర్థిక శాఖ సమాయత్తమైంది. అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదేశాలు వెళ్లాయి. ‘ఒకే రోజు అందరికీ పేమెంట్ చేస్తాం. దీనితో ఎంప్లాయీస్, పెన్షనర్ల సెల్ ఫోన్లు మెసెజ్‌లతో మోత మోగుతాయి’ అని ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి వివరించారు. ఆర్థిక చిక్కులన్నింటినీ అధిగమించి మెకానిజం రెడీ చేసి ఆదేశాలు ఇచ్చినందున ఇక జూన్ నుంచి పకడ్బందీగా అమలవుతుందన్నారు.

మానిటరింగ్ చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి

ఎంప్లాయీస్, పెన్షనర్ల అకౌంట్లలో నిధులను జమ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారం రోజుల ముందు నుంచే స్వయంగా మానిటరింగ్ చేశారు. జీతాల చెల్లింపు పూర్తయ్యే వరకు ఇతర అవసరాలన్నింటినీ పక్కన పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులను అదేశించినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ పరిధిలో జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు సుమారు రూ.4,450 కోట్ల అవసరం అవుతాయని ఆఫీసర్ల అంచనా. డిప్యూటీ సీఎం ఆదేశంతో ఉద్యోగులు, పెన్షనర్ల పేమెంట్‌కు తొలి ప్రయారిటీ ఇచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులను తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల విషయంలో ఫస్ట్ తారీఖునే పేమెంట్ జరగాలని ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకున్నందున ‘మే డే’ లాంటి ప్రత్యేక సందర్భాలను పరిగణనలోకి తీసుకుని ఇక నుంచి అలాంటి బ్యాంక్ హాలిడేస్ వస్తే నెల చివరి రోజునే పేమెంట్ జరిగేలా చూస్తామని, మౌఖికంగా తమకు అలాంటి ఆదేశాలే అందాయని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News