తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి : సిక్తా పట్నాయక్

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు

Update: 2024-03-27 12:19 GMT

దిశ, హనుమకొండ టౌన్ : గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో తాగునీటికి సంబంధించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా వివిధ పనులపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన అన్ని మండలాల్లోని గ్రామాల్లో తాగునీటి సరఫరా కి సంబంధించి బోర్లు, చేతిపంపులు, మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు, మిషన్ భగీరథ నీటి సరఫరా, తదితర అంశాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరాకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే సత్వరమే పరిష్కరించే విధంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించి పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ డీఈలు ఇ. సునీత, శ్వేత, చంద్రు నాయక్, జీవన్ ప్రకాష్, శ్రీనివాస్, జిల్లాలోని మండలాల ఏఈలు పాల్గొన్నారు.

Similar News