'ఆత్మహత్య సమస్యకు పరిష్కార మార్గం కాదు.. సమస్యలను దైర్ఘ్యంగా ఎదుర్కోవాలి'

ఆత్మ విశ్వాసమే మహాబలమని, ఆత్మస్థైర్యంతో సమస్యలను దీటుగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య సమస్యకు పరిష్కార మార్గం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

Update: 2023-01-29 16:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆత్మ విశ్వాసమే మహాబలమని, ఆత్మస్థైర్యంతో సమస్యలను దీటుగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య సమస్యకు పరిష్కార మార్గం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి లోని బ్రహ్మ కుమారిస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో జరిగిన స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్.. నేను సైతం (ఆత్మహత్యల నివారణ సంస్థ) నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

సమస్యలు అన్నవి మనుషులకే వస్తాయని, ఎలాంటి సమస్యలు అయినా వివేకంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకోవచ్చన్నారు. సమస్యలను దీటుగా ఎదుర్కోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడకూడదు అని పిలుపునిచ్చారు. పిల్లల పట్ల వారి తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలని, పిల్లల మనస్తత్వాన్ని గమనించి వారికి ఎప్పటికప్పుడు ధైర్య సాహసాలను నింపాలని సూచించారు.

ప్రేమ విఫలం అయినా.. పరీక్షల్లో తప్పినా.. ఇతర ఎలాంటి సమస్యలు వచ్చినా.. ధైర్యంతో ఎదుర్కోవాలని, ఈ సమయంలో పిల్లల తల్లిదండ్రులు, స్నేహితులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు చైతన్య కార్యక్రమాలను చేపట్టాలన్న ఆలోచన ఉందని, ఈ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ఈద శామ్యూల్ రెడ్డి, ప్రతినిధులు ప్రొఫెసర్ విశ్వనాథం, కులకర్ణి, డాక్టర్ ఉషా కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News