సీఎం రేవంతన్న నమ్మకాన్ని నిలబెడుదాం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ముఖ్యమంత్రి రేవంతన్న తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రతి కార్యకర్త నిలబెట్టాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇన్చార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Update: 2024-05-06 10:58 GMT

దిశ, మర్రిగూడ: ముఖ్యమంత్రి రేవంతన్న తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రతి కార్యకర్త నిలబెట్టాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇన్చార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మర్రిగూడ ,నాంపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన ఇంటికి వచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నీదేనని తనతో హామీ తీసుకున్నాడని తెలిపారు. నా బలగం బలం కార్యకర్తలేనని సీఎం రేవంతన్న నమ్మకాన్ని మనమందరం బూత్ స్థాయిలో కష్టపడి గడప గడపకు తిరిగి హామీని నిలబెట్టాలని కార్యకర్తలను కోరారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి పడగొడతామని అంటుందని రాష్ట్రంలో ఎంపీ స్థానాలు 14 గెలిస్తే ఎలా పడగొడతాడో చూద్దామని కార్యకర్తలను హుషారిక్తించారు. రాష్ట్రంలోని 19 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు బాజాప్తాగా నడుస్తున్న మన మునుగోడు లో మాత్రం ఏ ఒక్క బెల్టు షాపు నడవనీయకుండా తాను మాత్రమే కట్టడి చేశానని తెలిపారు. కార్యకర్తలు ఈరోజు నుండి ఉదయము సాయంత్రము రెండు గంటలు గడప గడపకు ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసిన ప్రతి వ్యక్తి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుందని కేంద్రంలో కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రంగాలలో మన గ్రామాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత మనపైనే ఉంటుందని పేర్కొన్నారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి తానే చూసుకుంటానని ప్రతి కార్యకర్త నాలుగు రోజులు కష్టపడి గడప గడపకు తిరిగి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. సంస్థాగతంగా నిర్మాణంలో లేకున్నా బిజెపి పార్టీ తాము అధికారంలోకి వస్తామని ,వస్తే రిజర్వేషన్లను తీసేస్తామని చెబుతుందని ఎస్సీ, ఎస్టీ ,బీసీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మర్రిగూడ మండలంలో అత్యధిక మెజార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాసు, కత్తి రవీందర్ రెడ్డి, జెడ్పిటిసిలు పాశం సురేందర్ రెడ్డి, ఏవీ రెడ్డి నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్రావు, నాయకులు పూల వెంకటయ్య ,రఘుపతి రెడ్డి , మాస నీలిమ శేఖర్, వీరమల్ల లోకేష్, వెంకటంపేట బాలయ్య, ఈద రాములు, చిట్యాల యాదగిరి రెడ్డి మహిళా నాయకురాలు దీపిక బూత్ స్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News