బియ్యం దందాలో కింగ్....ఆ షాపు కూడా బినామీనే....

నల్గొండ పట్టణంలో రేషన్ బియ్యం దందాలో ఆయన కింగ్... అధికారుల కనుసన్నల్లోనే పిడిఎస్ బియ్యం తతంగమంతా నడుస్తున్నట్లు సమాచారం.

Update: 2024-05-18 10:19 GMT

దిశ, నల్గొండ బ్యూరో : నల్గొండ పట్టణంలో రేషన్ బియ్యం దందాలో ఆయన కింగ్... అధికారుల కనుసన్నల్లోనే పిడిఎస్ బియ్యం తతంగమంతా నడుస్తున్నట్లు సమాచారం. ప్రతి నెల మామూళ్లతో పాటు ఇతర అవసరాలకు కూడా అధికారులకు ఉపయోగపడుతున్నారని, అందుకే ఆయన వైపు ఎవరు చూడాలన్నా భయపడుతుంటారని తెలిసింది..

పూర్తి వివరాలకు వెళితే ..

నల్గొండ మున్సిపాలిటీ, రూరల్ ప్రాంతాల్లో 82 షాపులుండగా, సుమారు 50,062 రేషన్ కార్డులు ఉన్నాయి. 10వేల క్వింటాల బియ్యం వరకు ఈ షాపులకు కేటాయించి ప్రజలకు పంపిణీ చేస్తుంటారు. ఒక్క వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున లబ్ధిదారులకు అందజేస్తుంటారు.

బియ్యం పంపిణీ ఇలా....

నల్గొండ పట్టణంలో మునుగోడు రోడ్డులో అక్రమ బియ్యం దందా నడుపుతున్న ఆ షాపుకు ప్రతి నెల సుమారు 170 క్వింటాళ్ల బియ్యం కాగా , అందులో అంత్యోదయ కార్డులకు 19.95 క్వింటాళ్ల బియ్యం, ఆహార భద్రత కార్డులకు 158 క్వింటాళ్ల బియ్యం షాపుకు కేటాయిస్తున్నారు.. ఇవే కాకుండా ఇతర గ్రామాలలో రేషన్ కార్డు ఉండి నల్గొండ టౌన్ లో బియ్యం తీసుకోవడానికి పోర్టబులిటి అవకాశం ఉంది. అంత్యోదయ కార్డు పేరుతో 17 క్వింటాలు, రేషన్ కార్డుల పేరుతో 114 క్వింటాళ్ల బియ్యం ఈ షాపు నుంచి లబ్ధిదారులకు పంపిణీ జరుగుతుంది..

పంపిణీ రికార్డులకే పరిమితం....

పేదలకు మూడు పూటలా తిండి పెట్టాలని ఉద్దేశంతో కేటాయించబడిన రేషన్ బియ్యం పంపిణీ పూర్తిగా రికార్డులకే పరిమితం అవుతుంది. మునుగోడు రోడ్డులో ఉన్న రేషన్ షాపు నిర్వాహకుడు ( బీనామీ) బియ్యం పంపిణీ చేస్తున్నట్లు రికార్డుల్లో వేలిముద్రలు వేయించుకున్నారు. కానీ బియ్యం మాత్రం పేదలకు చేరడం లేదు. కేజీ బియ్యం రూ.10 నుంచి రూ.12 వరకు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తుంటారు. కానీ తను మాత్రం రూ.16 నుంచి రూ.18వరకు బయట విక్రయిస్తున్నట్లు సమాచారం ..

తన షాపుకు కేటాయించిన బియ్యం తో పాటు గా పోర్టబిలిటీ పేరుతో మరో 131 క్వింటాళ్ల బియ్యం కూడా ఈ షాపు నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తను కేటాయించిన బియ్యంతో పాటు పోర్టబిలిటీలో కేటాయించిన బియ్యం కూడా సుమారు కలిపి మొత్తంగా 300 క్వింటాళ్ల బియ్యం తో అక్రమ వ్యాపారం చేస్తున్నారు .. వీటితోపాటు మున్సిపాలిటీ,, రూరల్ ప్రాంతాల నుంచి కూడా బియ్యం కొనుగోలు చేసి అన్నింటిని తన షాపు సమీపంలోనే ఉన్న ఓ ఇంటిలో నిలువ చేసి ఒకేసారి 500 నుంచి 700 క్వింటాళ్ల బియ్యం జమ చేసిన తర్వాత ఒకేసారి రైస్ మిల్లులు లేదా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.

దందా అధికారుల కనుసన్నల్లోనే..

నల్గొండ పట్టణంలో జరిగే అక్రమ బియ్యం దందా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని, పూర్తిగా సంబంధిత శాఖ అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు వినికిడి. అధికారులకు ప్రతి నెల మామూలు, రేషన్ డీలర్ల యూనియన్ కు కూడా ఖర్చులకు సొమ్ము అందజేస్తున్నట్లు ఆయనే అక్కడక్కడా చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే ఏనాడు కూడా బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యక్తి పట్టుబడలేదు.

ఇదంతా ఇలా ఉంటే బియ్యం దందాలు చేస్తున్న అతనికి తన పేరు మీద రేషన్ షాపే లేదు. కానీ తన బంధువు పేరు మీద ఉన్న షాపును నిర్వహిస్తూ దందాను కొనసాగిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఈ విషయం కూడా అధికారులకు తెలిసినప్పటికీ మామూళ్లకు ఆశపడి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని డీలర్ల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News