మంత్రి పదవికి కోసం అయితే 12 మందితో పాటే బీఆర్ఎస్ లోకి పోయేవాడిని : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

తాను మంత్రి పదవి కోసం భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేస్తున్నానని హరీష్ రావు విమర్శిస్తున్నాడని, పదవుల కోసం ఆశపడే వాడినైతే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినప్పుడే తాను చేరితే మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ అన్నాడని,

Update: 2024-05-05 09:04 GMT

దిశ,చౌటుప్పల్ /సంస్థాన్ నారాయణపురం: తాను మంత్రి పదవి కోసం భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేస్తున్నానని హరీష్ రావు విమర్శిస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవుల కోసం ఆశపడే వాడినైతే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినప్పుడే తాను చేరితే మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ అన్నాడని, అయినా తాను వెళ్లలేదని తెలిపారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గం లోని సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాల బూత్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని వేరువేరుగా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... బూత్ కమిటీ సభ్యుల గౌరవాన్ని పెంచడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఏనాడు సంపాదించలేదని, పదవుల కోసం ఏనాడు పాకులాడ లేదని అన్నారు. తనను గెలిపించిన ప్రజల నమ్మకం వమ్ము చేయకుండా పనిచేస్తానని అన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం, పునాది అన్నారు. కార్యకర్తల పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పుకొచ్చారు. తనను విమర్శించేందుకు ఏమీ లేక మంత్రి పదవికి ఆశపడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ,బూర నర్సయ్య గౌడ్ ఆరోపిస్తున్నారని గుర్తు చేశారు.

బూత్ స్థాయిలో కష్టపడి మెజార్టీ తెచ్చిన వాళ్లకు పదవులు, గౌరవం దక్కుతాయని హామీ ఇచ్చారు.

బూత్ స్థాయిలో 10 నుంచి 30 మందిని ఏర్పాటు చేస్తానని, వారందరినీ తాను పేరు పెట్టి పిలిచేలా పనిచేస్తానని అన్నారు. చామలను గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ తన భుజాలపై వేసిందని అందుకు పార్టీ కార్యకర్తలు అంత సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అభివృద్ధిలో తెలంగాణలో మునుగోడు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలుపుతామని అన్నారు. దేశంలో మునుగోడు అంటే తెలియని వారు ఉండరని,అవినీతి, కుటుంబ పాలన పోయేందుకు యుద్ధం ప్రకటిస్తే, తెలంగాణ ప్రభుత్వం మొత్తం మునుగోడుకు వచ్చిందని గుర్తు చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు ప్రజలకు,రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులకు లాభం చేకూరిందని అన్నారు.

తనకు పదవి ఇచ్చిన ఇవ్వకపోయినా మునుగోడును సస్యశ్యామలం చేసే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు అందరూ స్థానికంగా ఉండి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ పున్న కైలాష్ నేత, కోఆర్డినేటర్ సంధ్యారెడ్డి, చల్లూరి మురళీధర్ రెడ్డి, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News