ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి : కలెక్టర్ ​ హనుమంత్ కె.జెండగే

మే 13 పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ హనుమంత్ కె.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-04-30 11:36 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : మే 13 పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ హనుమంత్ కె.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం భువనగిరి పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 61 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారని, వీటిలో 10 నామినేషన్లను పరిశీలనలో తిరస్కరించినట్లు, 12 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, దీనితో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. వీరి కోసం 3 బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 2141 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి మొత్తం 18 లక్షల 8 వేల 585 ఓటర్లు ఉన్నారని, వీరిలో 8 లక్షల 98 వేల 416 మంది పురుషులు, 9 లక్షల 10 వేల 90 మంది స్త్రీలు, 79 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు.

     ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో స్టాటిస్టికల్ సర్వే లెన్స్, వీడియో సర్వైలెన్స్, వీడియో వీవింగ్ టీంలు కలిపి 58 టీంలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కాకుండా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. మొత్తం 245 సెక్టార్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ఒక సెక్టార్ అధికారి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా స్వాధీనం చేసుకున్న సీజర్ ఆభరణాలు, నగదును జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉంచుతారని, ఎన్నికలకు సంబంధం లేని వాటిని గ్రీవెన్స్ కమిటీ ద్వారా తిరిగి ఇస్తారని తెలిపారు. 7 నియోజకవర్గాలకు కలిపి ఇప్పటి వరకు 9 కోట్ల 43 లక్షల 17 వేల 69 రూపాయల విలువ గల మద్యం, ఆభరణాలు, డ్రగ్స్, డబ్బు పట్టుకున్నట్టు చెప్పారు. సువిధ ద్వారా అన్లైన్ అనుమతులు పొందాలని, ఆఫ్ లైన్ అనుమతులు అయితే సహాయ రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో సంతకంతో దరఖాస్తులు ఇవ్వాలని, ప్రతిదీ

     ఎన్ కోర్ లో నమోదు అవుతుందని తెలిపారు. "సి" విజిల్ యాప్ అందరూ వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమాళి ఉల్లంఘనల పట్ల ఫిర్యాదులు చేయాలని, 1950 హెల్ప్ లైన్ కూడా వినియోగించుకోవాలని కోరారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అక్కడే డిస్ట్రిబూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, జూన్ 4 న కౌంటింగ్ భువనగిరి పట్టణంలోని అరోరా కాలేజీలో నిర్వహించనున్నట్టు తెలిపారు. డీసీపీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ పోలింగ్ ఇంకా రెండు వారాలు ఉందని, జిల్లాలోని 816 పోలింగ్ కేంద్రాలలో అన్ని బందోబస్తు చర్యలు తీసుకున్నామని, బందోబస్తు కోసం ఫోర్స్ వచ్చిందని, ఇప్పటి వరకు 6 ఎంసీసీ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని, ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా ఎంసీసీ టీంలు పనిచేస్తున్నాయని, 3 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయన్నారు. కొన్ని చెక్ పోస్టులు టెంపరరీ ర్యాండమ్ ద్వారా తనిఖీలు చేస్తున్నాయని, పోలింగ్ కు 72, 48, 24 గంటల ముందు చేయవలసిన బందోబస్తు ఏర్పాట్లు, ఈవీఎం యంత్రాల

     భద్రత, కౌంటింగ్ కేంద్రం బందోబస్తు పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు, మైక్రో అబ్జర్వర్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 21 ఆయుధాల లైసెన్సులకు సంబంధించి ఒక లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగిందని, 11 ఆయుధాలు బ్యాంక్ గార్డ్స్ వద్ద ఉన్నాయని, మిగతా ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నట్లు, ఇప్పటి వరకు 571 మంది బైండోవర్ అయినట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని, ఎన్నికల నియమాల అతిక్రమణ పట్ల "సి" విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీనెంబరు వినియోగించుకోవాలని, ప్రజలు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయాలని, గత ఎన్నికలో మన జిల్లా పోలింగులో రోల్ మోడల్ గా నిలిచిందని ఈ సందర్భంగా అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్ పాల్గొన్నారు. 

Similar News