'రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరుపుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం'

రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరుపుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా సంయమనం పాటిస్తున్నామని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2023-01-25 17:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరుపుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా సంయమనం పాటిస్తున్నామని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రోటోకాల్‌ను తూచ తప్పకుండా పాటిస్తున్నామని, కానీ, బీజేపీ ప్రోటోకాల్‌ను పాటించడం కుదరదన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని మండిపడ్డారు. మోడీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్ రాయ్ ఓ పత్రిక లో రిసిన వ్యాసంలో రైతుల ఆదాయంపై పన్ను వేయాలని వివేక్ సూచించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది వివేక్ దేబరాయ్ మాటగా భావించడం లేదని, మోడీ మన్ కీ బాత్‌గా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆలోచనను మోడీ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

60 సంవత్సరాలపై బడి ఉన్న రైతులకు పెన్షన్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయానికి 30 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిందని, మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేసిందని మండిపడ్డారు. రైతాంగాన్ని చంపి వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బ్రిటిష్ పాలనలో చేసిన చట్టాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయంపై పన్ను విషయంలో బ్రిటీషర్లను అనుసరిస్తారా అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, యెగ్గే మల్లేశం పాల్గొన్నారు.

Similar News