కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు : వెంకట్రామిరెడ్డి

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సరిపడా సాగునీరు, విద్యుత్ ఉన్నప్పటికీ సరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు

Update: 2024-04-27 09:22 GMT

దిశ, గజ్వేల్ /కొండపాక : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సరిపడా సాగునీరు, విద్యుత్ ఉన్నప్పటికీ సరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ పట్టణం లోని బస్టాండ్ ప్రాంగణం, సమీకృత మార్కెట్, దుకాణాలు తదితర ప్రాంతాల్లో మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణలో గోదావరి జలాలు పారించి తాగు, సాగు నీటి గోస తీర్చిన ఘనత కేసీఆర్ కె దక్కిందన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో నాలుగు మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయక పోగా, ఉన్న కరెంటు, నీళ్లు ఇవ్వడం లేదన్నారు.కేసీఆర్ ప్రభుత్వం లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ముప్పై ఏండ్లు ముందుకుపోయిందని పేర్కొన్నారు.

మాయ మాటలు చెప్పిన రఘునందన్ రావుకు దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారని, ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్నారు. జిల్లా కలెక్టర్ గా సిద్దిపేట ను అభివృద్ధిలో దేశంలోనే పదవ స్థానానికి తీసుకుపోవడం జరిగిందన్నారు.కలెక్టర్ గా ఉన్న పరిపాలన అనుభవం తో మీ పనులు సులభంగా పరిష్కారమవుతాయన్నారు. నా లెక్క యువతీ యువకులను తీర్చి దిద్దడం కోసమే గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల గుణ గుణాలను చూసి ఓట్లెయ్యాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Similar News