ఆశీర్వదించండి.... నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా : నీలం మధు

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసారని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.

Update: 2024-04-27 10:22 GMT

దిశ, మిరుదొడ్డి: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసారని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మిరుదొడ్డి, అక్బర్ పేట, భూంపల్లి మండల కేంద్రాలలో నీలం మధు, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని, ఆగస్టులోగా రెండు లక్షల రైతు రుణమాఫీ కూడా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. గత పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేక పోయిందన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో కనీసం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టలేకపోయారన్నారు. ఇందిరమ్మ హయాంలోనే దళితులకు భూముల పంపిణీ, అలాగే ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఇప్పుడు మళ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించి ఇస్తామని, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు కూడా ఇస్తామని తెలిపారు.

వెంకట్రామిరెడ్డి ఇప్పుడు 100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని మాయమాటలు చెప్తున్నాడన్నారు. ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు నిధి ఏర్పాటు గురించి ఎందుకు ఆలోచించలేదు అని ప్రశ్నించారు. తన ఆస్తి కాపాడుకోవడం కోసమే కేసీఆర్ కాళ్లు మొక్కి రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని అన్నారు. బహుజన బిడ్డగా కింది స్థాయి నుంచి వచ్చిన తనకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు.. ఆశీర్వదించి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి ముత్యంరెడ్డి హయాంలోని జరిగిందని, తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం చేయలేని వెంకట్రాంరెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావని ప్రశ్నించారు. ఆయన ఒక పెట్టుబడిదారుడు, మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. నీలం మధు ముదిరాజ్ బహుజన బిడ్డగా అందరి కష్టాలు తెలుసు కాబట్టి చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మద్దుల గాల్ రెడ్డి, మామిడి మోహన్ రెడ్డి, నేరండ్ల భూమా గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మద్దెల రాజేశం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News