ఆర్ఎస్పీ ఓ నియంత…

నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని గద్వాల్ బిఎస్పీ నియోజక ఉపాధ్యక్షుడు సవారన్న, నాయకులు ఆరోపించారు.

Update: 2024-04-27 11:10 GMT

దిశ, గద్వాల ప్రతినిధి : నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని గద్వాల్ బిఎస్పీ నియోజక ఉపాధ్యక్షుడు సవారన్న, నాయకులు ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ రాజకీయంగా ఎదగడానికి బహుజన సమాజ్ పార్టీలో చేరి కొన్ని రోజుల పాటు దొరల పాలన పై యుద్ధం చేసిన ఆయన అదే దొరల పార్టీలో ఎందుకు చేరారో బహుజనులకు సమాధానం చెప్పాలని కోరారు. బహుజనులకు వ్యతిరేకంగా దొరల పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజన వాదం కన్నా పదవులే ముఖ్యమని వారు ఆరోపించారు.

రాజకీయ లబ్ధి కోసం బీఎస్పీ పార్టీని బహుజన వాదాన్ని ఆ పార్టీ కార్యకర్తలను వాడుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టిక్కెట్ కోసం దొరల కాళ్ల దగ్గర తాకట్టుపెట్టిన ఆర్ఎస్ కి రానున్న ఎన్నికలలో బహుజనులు బుద్ది చెబుతారని‌ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూల్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ చేయడానికి చివరి నిమిషం వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆర్ఎస్పీ చేతనైతే క్షేత్రస్థాయిలో పోరాడాలని అన్నారు. కాంగ్రెస్, బిజెపి లాంటి పెద్ద పార్టీల అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల గెలుపుకు ప్రవీణ్ కుమార్ కృషి చేస్తున్నాడని అన్నారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో బీఎస్పీ కి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భయపడుతున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో మా పార్టీకి బలం లేకపోవచ్చు కానీ బ్యాలెట్ బాక్స్ లలో మా బలం చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి లాంటి పార్టీల జోలికి వస్తే ఏం చేస్తారో ప్రవీణ్ కుమార్ కు బాగా తెలుసని అన్నారు. అందుకోసమే బిఎస్పి మీద పడి ఏడుస్తున్నారని అన్నారు. ప్రవీణ్ కుమార్ నీచమైన రాజకీయాలు, లాలూచీ రాజకీయాలు చేయడం మానుకోవాలని, దొరల చెంత చేరి దొర లాగ వ్యవహరించొద్దని సూచించారు. మీరు చేసే గుండా రాజకీయాలను ఎదిరించి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఏనుగు గుర్తు నిలబడేటట్లు చేశారని అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో బీఏస్పీ అభ్యర్థి ని గెలిపించుకొని బహుజన జెండా ఎగురవేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోశాధికారి వెంకట్, ధరూరు మండల నాయకులు మహంతేష్, సుధాకర్, భాస్కర్ ఇతరులు ఉన్నారు.

Similar News