తలదించుకునే రోజు తీసుకొస్తా.. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్రంలో రైతుల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ యముడిలా దాపరించాడని ధరణి పేరుతో వే

Update: 2022-09-23 17:13 GMT

దిశ, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ యముడిలా దాపరించాడని ధరణి పేరుతో వేలాది ఎకరాలను స్వాహా చేస్తున్నాడని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళన పేరుతో ధరణి వెబ్సైట్ తీసుకొస్తున్నట్లు చెప్పి అమాయకులైన రైతుల భూములను ధరణి ఆన్లైన్లో లేకుండా మాయం చేస్తున్నాడని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలను తన వశం చేసుకుంటున్నాడని మండిపడ్డారు.

రాష్ట్రంలోని రైతుల పాలిట ఒక యముడిలా వ్యవహరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంగా తన ఎనిమిది ఎకరాల పొలాన్ని ధరణి వెబ్సైట్లో లేకుండా చేశాడని, తాను కోర్టుకెళ్లి తన హక్కుగా పొందగలనని పేర్కొన్నారు. కానీ అమాయకుల రైతుల పంట పొలాల సంగతి ఏంటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోలీసు వ్యవస్థను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను అణగదొక్కాలని చూస్తున్నాడని, అందులో భాగంగానే తిమ్మాజీపేటలో ఒకరు, తెలకపల్లిలో ఒకరిని థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదారని, ఈ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో నల్ల మట్టి, ఇసుక మాఫియా, మట్టి దందా, భూమాఫియా ఇలా ఎక్కడ చూసినా మాఫియా గ్యాంగ్ గా తయారై నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని మింగేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తలెత్తుకునే పరిస్థితి లేకుండా అవినీతి భాగవతాన్ని బట్టబయలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వారి వెంట డిసిసి ప్రధాన కార్యదర్శి అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

Similar News