ఆ ఘటనపై గవర్నర్ సీరియస్.. సెల్ పోన్ ద్వారా బాధిత మహిళ‌కు గవర్నర్ పరామర్శ

Update: 2022-01-27 17:25 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా లోని అచ్చంపేట సివిల్ ఆసుపత్రి వద్ద గత మంగళవారం ప్రసవం కోసం వచ్చిన నిమ్మల లాలమ్మ పట్ల వైద్యులు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో.. గవర్నర్ తమిళిసై వైద్యుల పట్ల సీరియస్ అయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని బల్మూరు మండలం గ్రామానికి చెందిన లాలమ్మ సుఖ ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే కోవిడ్ పాజిటివ్ ఉందని అమానుషంగా వైద్యులు నిరాకరించడంతో నరక యాతన పడుతూ.. ఆస్పత్రి ఆవరణలో ప్రసవం అయిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ సంఘటన పై గవర్నర్ తమిళిసై స్వయంగా సెల్ పోన్ ద్వారా బాధిత మహిళను పరామర్శించి తల్లి బిడ్డ యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంది.

మా చెంచుల పట్ల గిట్లనే వైద్య సేవలు ఉంటాయి..

గవర్నర్ తమిళిసై బాధితురాలి బావ సలయ్య సెల్‌ఫోన్ కి ఫోన్ చేసి హలో.. నేను గవర్నర్ తమిళిసై అనగానే చెప్పండి మేడం అనగానే బాధిత మహిళ బిడ్డ ఎలా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారా అని ఆరా తీశారని, ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారని ఆయన 'దిశ' కు తెలిపారు. మా చెంచుల పట్ల వైద్య సేవలు గిట్లనే ఉంటాయా..? మేడం ఆదివాసీ చెంచులు అనగానే చిన్న చూపుతో కనీసం వైద్య సేవలు పొందలేక అవస్థలు పడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయని గవర్నర్ మేడంకు చెప్పానన్నారు సలయ్య. తదుపరి మేడం మాట్లాడుతూ.. ఇకనుండి ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని తెలిపారన్నారు.

రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా..

గవర్నర్ తమిళిసై ఆదేశాలతో బాధిత మహిళలను గురువారం రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి తన బృందంతో బాణాల గ్రామానికి వెళ్లి తల్లీ బిడ్డలను పరామర్శించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ ఆదేశాలతో నిమ్మల లాలమ్మ తన కూతురు ఆరోగ్యంగా ఉన్నారని, చిన్నారికి మస్కిటో నెట్, హైజన్ కిట్, సంస్థ తరఫున రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అలాగే లాలమ్మ ప్రసవం కోసం వెళ్లిన సందర్భంగా అచ్చంపేట సివిల్ ఆస్పత్రి వద్ద ఎదురైన ఇబ్బందులు విషయం పై సమగ్ర విచారణ చేసి తగిన నివేదికను గవర్నర్‌కు అందజేస్తామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News