మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నలిపి వేసి,రిజర్వేషన్‌లు రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుంది : రాహుల్ గాంధీ

ఈ దేశ ప్రయోజనాలు, బీద బడుగు వర్గాల ప్రజానీకం

Update: 2024-05-05 13:44 GMT

దిశ,ఎర్రవల్లి/ఇటిక్యాల : ఈ దేశ ప్రయోజనాలు.. బీద బడుగు వర్గాల ప్రజానీకం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ ఎన్నో కష్టాలు పడి రూపొందించిన భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం నలిపెయ్య చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి సమీపంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం వల్లే ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు లభించాయి. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో అవకాశాలు లభించాయని చెప్పారు. ఇటువంటి రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం నలిపి వేసి, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ కుట్రలను తీపి కొట్టి భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకుంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి 22 కుటుంబాలకు 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి వారిని మరింత సంపన్నులను చేసింది. కానీ రైతుల రుణమాఫీ చేయలేదు అని రాహుల్ గాంధీ ఆరోపించారు.


కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు లక్షలాది మందిని ఉద్యోగులు తాము ఎంత చదివిన మోడీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం లేదు అని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలకు సరైన వేతనాలు చెల్లించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తాను, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి భద్రతలను కల్పిస్తాం. డిగ్రీ, ఆపై చదువులు పూర్తయిన వెంటనే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుల గణన చేసి రాజకీయంగా, విద్య, ఉద్యోగపరంగా లభించవలసిన అప్పులను కల్పిస్తామని చెప్పారు. దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలలో ఉన్న మహిళల పేరిట ప్రతి నెలరూ.8500 చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం మనదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తామని వెల్లడించారు. దేశ ప్రజల మధ్య మతాల పేరుతో బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెడుతోంది. ఆ పరిస్థితులను అధిగమించి దేశ ప్రజల మధ్య సమైక్యత పెంపొందించే విధంగా పాలన సాగిస్తామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.


ఫైనల్ పోరు తెలంగాణ వర్సెస్ గుజరాత్...

గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మనకు సెమీఫైనల్ లాంటివి. ఆ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ఓడించి ఇంటికి పంపాము. వచ్చే పార్లమెంటు ఎన్నికలు మనకు ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ గా సాగుతోంది. ఆ మ్యాచ్లో గెలిచి మన సత్తా చాటుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బి.ఆర్.ఎస్, బిజెపి చీకటి ఒప్పందాలు చేసుకుని ఈ ఎన్నికల్లో మనలను ఓడింప చూస్తున్నారు. వారి కుట్రలను అధిగమించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని రేవంత్ రెడ్డి కోరారు. పాలమూరుకు అన్యాయం చేసిన వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాసు మున్షీ, జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి,ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి,మెగా రెడ్డి, రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.


Similar News