జడ్చర్లలో భారీ వర్షం.. నది ప్రవాహాలను తలపిస్తున్న రోడ్లు

జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏకధాటిగా గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువలు నల్లకుంట ఉప్పొంగడంతో జడ్చర్ల పట్టణంలోని

Update: 2024-05-18 15:25 GMT

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏకధాటిగా గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువలు నల్లకుంట ఉప్పొంగడంతో జడ్చర్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయమై ప్రయాణికులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. జడ్చర్ల 4వ వార్డ్‌లోని వెంకటేశ్వర కాలనీలో నల్లకుంట నిండి వర్షపు నీరు రహదారి పైకి రావడంతో రహదారులు పూర్తిగా జలమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో వాహనదారులు, ప్రజలు రోడ్డు దాటడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. పట్టణంలోని 16 వార్డులు లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

11వ వార్డులో శ్రీనివాస థియేటర్ సమీపంలో 167వ జాతీయ రహదారిపై నదిని తలపించేలా వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు మెల్లమెల్లగా రోడ్డు దాటారు. ఆ ప్రాంతంలో పలు కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతోపాటు కావేరామపేట బాబా నగర్ ప్రాంతంలో భారీగా కాలనీలో చేరడంతో కాలనీలను జలమయమయ్యాయి. కల్వకుర్తి వైపు వెళ్లే 167 వ జాతీయ రహదారి నిర్మాణ పనులను ఆర్ అండ్ బి అధికారులు నడకన చే పడుతుండడంతో ఆ రోడ్డులో మొత్తం వర్షపు నీరు వచ్చి చేరడంతో ఆ మార్గ వెంట వాహనాలు వెళ్లడం కష్టతరంగా మారింది. వర్ష ప్రవాహానికి బాదేపల్లి మార్కెట్ యార్డు ప్రహరీ గోడ కూలిపోగా రైతుల వద్ద వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యం తడిసి ముద్దయింది.

జడ్చర్ల పట్టణంలో వర్షం పడిన ప్రతిసారి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమై పలు కాలనీలలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకటేశ్వర కాలనీ లో వర్షపునీరు ప్రవాహ ప్రాంతాన్ని పలువురు నాయకులు చేరుకొని మున్సిపల్ సిబ్బంది సమాచారం అందించి మున్సిపల్ కార్మికులతో కలిసి వర్షపు నీటిని దారి మళ్ళించే ప్రయత్నాలను చేపట్టారు. జడ్చర్ల పట్టణ ప్రజలకు చినుకు పడిందంటే వణుకు పుడుతుంది. ఆక్రమణకు గురైన మురుగు కాలువలను పునర్నిర్మించి వర్షపు నీరు ఇళ్లల్లోకి రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలు కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు.

Similar News