ఆ కుటుంబానికి కలిసిరాని శ్రీరామనవమి

శ్రీరామనవమి పర్వదినం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపుతుంది. రెండేళ్ల క్రితం శ్రీరామనవమి రోజే కరోనాతో తమ్ముడు మృతి చెందాడు.

Update: 2023-03-30 11:18 GMT

దిశ, వైరా : శ్రీరామనవమి పర్వదినం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపుతుంది. రెండేళ్ల క్రితం శ్రీరామనవమి రోజే కరోనాతో తమ్ముడు మృతి చెందాడు. మరలా శ్రీరామనవమి పర్వదినమైన గురువారం రోజున క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అన్న దుర్మరణం చెందాడు. ఇలా రెండు శ్రీరామనవమి రోజుల్లో అన్నదమ్ములు మృతి చెందటం ఆ గ్రామస్తులను కలిసి వేసింది. ఈ విషాదకర ఘటన వైరా మండలంలోని గరికపాడు గ్రామంలో చోటు చేసుకుంది.

కోవిడ్ తో ఒకరు.... క్యాన్సర్ తో మరొకరు...

వైరా మండలంలోని గరికపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శీలం కరుణాకర్ రెడ్డి 2021 ఏప్రిల్ నెలలో కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన భార్య హరితకు కూడా కరోనా వైరస్ సోకింది. చికిత్స పొందుతున్న కరుణాకర్ రెడ్డి 2021 ఏప్రిల్ 21వ తేదీన (శ్రీరామనవమి రోజు )మృతి చెందారు. ఆయన భార్య కూడా చికిత్స పొందుతూ ఏప్రిల్ 30వ తేదీన మృతి చెందింది.

     అదేవిధంగా కరుణాకర్ రెడ్డి అన్న శీలం వెంకటేశ్వర రెడ్డి ఖమ్మంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన కూడా గత సంవత్సర కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్ ప్రభావం గుండె, ఊపిరితిత్తులపైన కూడా పడింది. హైదరాబాద్​లో చికిత్స పొందిన ఆయన శ్రీరామనవమి రోజైన గురువారం మృతి చెందాడు. వెంకటేశ్వర రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామైన గరికపాడుకు తీసుకువచ్చారు. అన్నదమ్ములిద్దరూ శ్రీరామనవమి పర్వదినం రోజే మృతి చెందారు. రెండు సంవత్సరాల కాలంలో ఒకే ఇంట్లో ముగ్గురు దుర్మరణం చెందటం గ్రామస్తులను కలిసి వేస్తుంది.

తండ్రి చివరి చూపునకు నోచుకోని కుమారుడు

క్యాన్సర్ వ్యాధితో మృతి చెందినా తన తండ్రి చివరి చూపుకు కుమారుడు నోచుకోలేని హృదయ విధారక పరిస్థితి ఇది. క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన వెంకటేశ్వర రెడ్డి చిన్న కుమారుడు శీలం సాయి లక్ష్మారెడ్డి అమెరికాలోని న్యూయార్క్ బ్రిడ్జిఫోర్ట్లో ఎమ్మెస్ చదువుతున్నాడు. తండ్రి అనారోగ్యానికి గురికావడంతో 2022 జూన్ నెలలో అమెరికా నుంచి స్వదేశానికి వచ్చాడు. ఆరు నెలల పాటు తండ్రి వద్దే ఉండి సపర్యలు చేశారు. 2022 డిసెంబర్ నెలలో సాయి లక్ష్మారెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కోసం అమెరికా వెళ్లాడు.

     తండ్రి మృతి చెందిన సమాచారాన్ని గురువారం సాయి లక్ష్మారెడ్డికి కుటుంబ సభ్యులు ఫోన్లో తెలిపారు. అయితే సాయి లక్ష్మారెడ్డి అమెరికా వెళ్లి మూడు నెలలు మాత్రమే గడిచింది. ఆరు నెలలు గడిచిన తర్వాత స్వదేశానికి వచ్చే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒకవేళ హుటా హుటిన సాయి లక్ష్మారెడ్డి ఇండియాకు వచ్చినా మరలా చదువుకు అమెరికా వెళ్లేందుకు అవకాశం ఉండదని కుటుంబ సభ్యులు తెలిపారు. చదువు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి మృతి చెందినా ఆయన స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో తండ్రి వెంకటేశ్వర రెడ్డి మృతదేహాన్ని కడసారి చూసుకునేందుకు కూడా సాయి లక్ష్మారెడ్డి నోచుకోలేదు. మరోవైపు తనకున్న ఇద్దరు కుమారులు మృతిచెందడంతో తల్లి నాగమ్మ గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది.  

Similar News