గాజులతండాలో పంపు ఆపరేటర్ నిర్బంధం
నీటి సమస్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాజులతండాలో గ్రామపంచాయతీ పంపు ఆపరేటర్ ను గురువారం నిర్బంధించారు.
దిశ, కారేపల్లి : నీటి సమస్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాజులతండాలో గ్రామపంచాయతీ పంపు ఆపరేటర్ ను గురువారం నిర్బంధించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భాగ్యనగర్తండా గ్రామపంచాయతీ పరిధిలోని గాజులతండా వద్ద ఉన్న తాగునీటి డైరెక్ట్ పంపింగ్ మోటార్ ద్వారా గాజులతండా, సామ్యాతండా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఉమ్మడి భాగ్యనగర్తండా పంచాయతీలో ఉన్న గాజులతండా గ్రామం పంచాయతీల పునర్వీభజనలో భాగంగా పక్కనే ఉన్న గుట్టకిందిగుంపు పంచాయతీలో భాగమైంది.
దీంతో గత నాలుగేండ్లుగా గాజులతండాకు నీటిని అందించటంలో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో గ్రామస్తులు నీటి ఎద్దటితో బాధపడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో గాజులతండా గ్రామంకు భాగ్యనగర్తండా పంచాయతీ వారు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం పంపు హౌస్ వద్దకు వచ్చిన పంపు ఆపరేటర్ అజ్మీర హేమచంద్ ను గుట్టకిందిగుంపు ఉపసర్పంచ్ ఎస్కే.ఉషాగౌసు ఆధ్వర్యంలో గాజులతండా గ్రామస్తులు గదిలో బంధించారు. గాజులతండా నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.