ఖమ్మంలో పర్యటించి తనిఖీలు చేసిన మంత్రి పువ్వాడ

గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణ, సుందరీకరణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...Minister Puvvada Visits Khammam

Update: 2023-01-24 16:42 GMT

దిశ, ఖమ్మం సిటీ: గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణ, సుందరీకరణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. 29వ డివిజన్ ప్రకాశ్ నగర్ లోని ప్రొ. కె. జయశంకర్ పార్క్, 34వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ లోని కాళోజీ నారాయణ రావు, మంచికంటి రామకిషన్ రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ పార్కులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దుర్భరమైన, దుర్గంధమైన ప్రదేశంతో, దోమలు, అపరిశుభ్ర వాతావరణంలో 3వ పట్టణ ప్రజలు నివసించేవారని, ముఖ్యమంత్రి 2016 లో జిల్లా పర్యటనను పురస్కరించుకుని పాదయాత్ర చేసి పరిశీలించి ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. గోళ్లపాడు ఛానల్ పనులు రూ. 100 కోట్లతో చేపట్టినట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతోపాటు, 11 కి.మీ. మేర సుందరీకరణతోపాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలకు ఆహ్లాదం పంచడానికి 10 పార్కులు, ఆహ్లాదంతోపాటు ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్, క్రీడాప్రాంగణాల ఏర్పాటు చేసి, బాస్కెట్ బాల్, షటిల్, మెగా చెస్ బోర్డు, స్కెటింగ్ రింక్స్ లు తదితర క్రీడల కోర్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గోళ్లపాడు ఛానల్ పై ఏర్పాటు చేసిన పార్కులు తెలంగాణ వైతాళికులు ప్రొ. కె. జయశంకర్, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, మంచికంటి రామకిషన్ రావు, పద్మశ్రీ వనజీవి రామయ్య, రజబ్ అలీ తదితరుల పేర్లను రాజకీయాలకు అతీతంగా నామకరణం చేసినట్లు ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి కె. తారకరామారావుచే పార్కుల ప్రారంభోత్సవం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మిగులు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మునిసిపల్ ఈఈ కృష్ణ లాల్, ఖమ్మం అర్బన్ తహశీల్దార్ శైలజ, మునిసిపల్ ఏఈ సతీష్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News