పురుగుమందుతో కూర చేసిన మహిళ.. భర్తకు క్యారేజీ తీసుకెళ్లి..

దిశ, తిరుమలాయపాలెం: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ మతిస్థిమితం సరిగా లేక పురుగుమందుతో..

Update: 2022-08-13 08:21 GMT

దిశ, తిరుమలాయపాలెం: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ మతిస్థిమితం సరిగా లేక పురుగుమందుతో కూర వండింది. అనంతరం అదే కూరతో అన్నం తిని మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మేడిదపల్లి గ్రామానికి చెందిన బండ్ల నాగమ్మ (38) మూర్ఛ వ్యాధితో బాధపడుతుంది. మూర్ఛ వచ్చినప్పటి నుంచి కొన్ని రోజుల వరకు ఆమె మతిస్థిమితం కోల్పోతుంది. ఈ క్రమంలోనే గత బుధవారం నాగమ్మకు మూర్చ వచ్చింది. ఆ తర్వాత రోజు గురువారం వంట చేసే క్రమంలో అప్పటికే మతిస్థిమితం సరిగా లేని నాగమ్మ పొలం కోసం తెచ్చిన మోనో పురుగుల మందును కూరలో పోసి వండింది. మందుతో వండిన కూరను ఆమె తిని, పొలం దగ్గర పని చేస్తున్న భర్త పుల్లయ్యకు క్యారేజి కట్టుకుని వెళ్ళింది.

భర్త పుల్లయ్య అన్నం తింటుండగా ఒక విధమైన వాసన రావడంతో అనుమానం రావడంతో అక్కడే ఉన్న కూతురు పల్లవి, గొర్రెల కాపరి వెంకట మల్లయ్య సైతం చెరి రెండు ముద్దుల అన్నం తిని చూశారు.అనంతరం వారు కూరలో పురుగుమందు కలిసిందని నిర్ధారించుకున్నారు. ఇంతలో నాగమ్మ అక్కడే వాంతులు చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం తెల్లవారుజామున మరణించింది. ముందు ఖమ్మం పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుల్లయ్య, పల్లవిని ఆ గ్రామ సర్పంచ్ బండ్ల విజయ-సురేష్ ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం పొందిన పుల్లయ్య, పల్లవితోపాటు గొర్రెల కాపరి వెంకట మల్లయ్య క్షేమంగా ఉన్నారు.



Similar News