దిశ ఎఫెక్ట్ … యుద్ధ ప్రాతిపదికన పైపులైన్ కు మరమ్మత్తులు

వైరా మండలంలోని వల్లాపురం గ్రామంలో మంచినీరు సరఫరా చేసే పైపులైనుకు మిషన్ భగీరథ అధికారులు సోమవారం ఎట్టకేలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.

Update: 2024-05-06 09:08 GMT

దిశ, వైరా : వైరా మండలంలోని వల్లాపురం గ్రామంలో మంచినీరు సరఫరా చేసే పైపులైనుకు మిషన్ భగీరథ అధికారులు సోమవారం ఎట్టకేలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. పాలడుగు గ్రామం నుంచి వల్లాపురం గ్రామానికి మంచినీరు సరఫరా చేసే హెచ్ డి పి 110 డయా పైపులైన్ కు సమీపంలోని పొలంలో ఉన్న మొక్కజొన్న దంటుకు నిప్పు పెట్టడంతో ఆ పైప్ లైన్ కాలిపోయింది. దీంతో వల్లాపురం గ్రామానికి వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయమై సోమవారం దిశ ఖమ్మం టాబ్లెట్ లో "వల్లాపురం విలవిల", మెయిన్ ఎడిషన్ లో "వారం రోజులుగా మంచినీటి సరఫరా బంద్" అనే వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి.

దీంతో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు వెంటనే పైపులైనుకు మరమ్మతులు చేయాలని మిషన్ భగీరథ అధికారులు ఆదేశించారు. మిషన్ భగీరథ డిఈ ఆర్ నరసింహమూర్తి దగ్గరుండి సిబ్బందితో ఆ పైపులైనుకు మరమ్మత్తులు చేయించారు. కాలిపోయిన పైపులైన్ స్థానంలో జిఐ 100 డయా పైపులైను ను ఏర్పాటు చేసి వల్లాపురం గ్రామానికి మంచినీటి సరఫరాను పునరుద్ధరించారు. తమ గ్రామానికి వారం రోజులుగా మంచినీరు సరఫరా చేయని విషయాన్ని బహిర్గతం చేసి సమస్యను పరిష్కరించిన దిశ దిన పత్రిక కు వల్లాపురం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News