ఎలాంటి పొరపాట్లు చేయరాదు

వరంగల్ - ఖమ్మం - నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం ( డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదివారం పరిశీలించారు.

Update: 2024-05-26 14:41 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : వరంగల్ - ఖమ్మం - నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం ( డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదివారం పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రి పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందించారా లేదా అన్నది సరిచూసుకోవాలని తెలిపారు. పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. పోలింగ్ సిబ్బంది, పరికరాలు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను, వాటికి అమర్చిన ట్రాకింగ్ పరికరాలను పరిశీలించి,

    సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాల వద్దకు సిబ్బందిని చేరుకునెలాగా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. వర్ష సూచనలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించాడు. బ్యాలెట్ పెట్టెల రవాణాకు పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. రేపు పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 252 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, సోమవారం జరిగే శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్ లో 100 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, కొత్తగూడెం ఆర్డీఓ మధు, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్, అంజద్ పాషా, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ధారా ప్రసాద్, రంగా ప్రసాద్, ఎన్ఐసీ సుశీల్, నవీన్, తదితరులు పాల్గొన్నారు. 

Similar News