పొన్నం వ్యవహార శైలిని చూసి సొంత పార్టీ నేతలే బెంబేలెత్తుతున్నారు : బండి సంజయ్

నాపై పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని

Update: 2024-04-30 09:42 GMT

దిశ,వేములవాడ : నాపై పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈనాడు తనపై అవాక్కులు పేల్చడం సిగ్గుచేటని, ఆయన వ్యవహార శైలిని చూసి సొంత పార్టీ నేతలే బెంబేలెత్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మే8న ప్రధాని మోదీ వేములవాడ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలో మోదీ పర్యటన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బండి సంజయ్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పై హాట్ కామెంట్స్ చేశారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనించే ప్రచారంలో ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, అందుకే 6 గ్యారంటీలపై అడిగితే తాను మాట్లాడలేనని సీఎం రేవంతే చెబుతున్నారని, దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

ఓటమి భయంతో కాంగ్రెస్ నీచానికి దిగజారుతోందని, దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదని ఎద్దేవాచేశారు. ఇక రైతులు, నిరుద్యోగులు సహా ప్రజలు అల్లాడుతుంటే కనీసం స్పందించని నేత వినోద్ కుమార్ అని అని అన్నారు. అలాగే సమాజంలో అనేక బాధలు ఎదుర్కొంటున్నది మాదిగలేనని, ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు బలిదాన మయ్యారని, అలాంటి మాదిగ సమాజంపై అవాకులు పేలుతున్న మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీలను కించపరుస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పేదలపైన, దళిత, గిరిజన, బీసీ, అగ్రవర్ణాల పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. చివరగా ఈనెల 8న వేములవాడ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారని, వేములవాడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Similar News