ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకుల ధర్నా ..

హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం

Update: 2024-05-16 09:28 GMT

దిశ,హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద నియోజకవర్గ బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తుందని బండ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతన్నలను మోసం చేసిందని మండిపడ్డారు.

ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని విమర్శించారు. జడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ మాట్లాడుతూ... రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ని రైతులే త్వరలో గద్దె దించుతారని హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ 500 చెల్లించాలని, మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ జడ్పీటీసీ పడిదం బక్క రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గూడూరి ప్రతాపరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వర్థినేని రవీందర్రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News