బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు : మంత్రి శ్రీధర్ బాబు

పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను

Update: 2024-05-02 10:03 GMT

దిశ,రామగిరి: పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసాయని, ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. గురువారం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ, మినిమం వేజ్ బోర్డు కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ తో కలిసి రామగుండం 3 ఏరియా ఓసీపీ 2 ఉపరితల గని గేట్ మీటింగ్ , రత్నాపూర్ గ్రామ శివారు రామగిరి ఖిల్లా వద్ద ఉపాధి హామీ కూలీల తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని ,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్కమ్ టాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ, మినిమం వేజ్ బోర్డు కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ పది సంవత్సరాలు టీబీజీకేస్ యూనియన్ అధికారంలో ఉండి కార్మిక సమస్యలు పరిష్కరించపోగా సింగరేణిలో రాజకీయ జోక్యం పెంచి సంస్థను నిర్వీర్యం చేశారన్నారు. పది సంవత్సరాలు సింగరేణిలో రిక్రూట్మెంట్ సరిగ్గా లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు యజమాన్యం తో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాం అని స్పష్టం చేశారు. అనంతరం రత్నాపూర్ లో ఉపాధి హామీ కూలీలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పనిదినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి దఫాలో ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఏదైనా సమస్యల ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులకు పెంచేలా కృషి చేస్తామన్నారు. మీరు నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదంతో ఇక్కడ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News