అవినీతి పార్టీలు అన్ని కలిపితే ఇండియా కూటమి.. జేపీ నడ్డా సెన్సేషనల్ కామెంట్స్

ఇండియా కూటమిపై బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్ అయ్యారు.

Update: 2024-04-29 11:33 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ఇండియా కూటమిపై బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. మహబూబాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత సమ్మక-సారలమ్మ, గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్‌కు నమస్కరిస్తున్నా అన్నారు. ఈ ప్రాంతంలో రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పది సంవత్సరాల మోడీ పాలనలో అన్ని వర్గాలను, అన్ని రంగాలను అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీలాగా ఓటు బ్యాంకు రాజకీయం చేయడం లేదని.. అభివృద్ధే తమ ప్రధాన ఎజెండా అన్నారు. హిందువుల చిరకాల వాంఛ అయోధ్యలో రామమందిర నిర్మాణం చేశామన్నారు. దేశ ఆర్మీని పటిష్టం చేసి, తీవ్ర వాదం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లో గిరిజన మ్యూజియం, గిరిజన యూనివర్సిటీ మోడీ హయాంలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరోసారి మోడీ ప్రధాని అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి కృషి చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే బీజేపీ ఎజెండా అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇప్పటి వరకు 4 కోట్ల ఇండ్లను నిర్మించామని.. రాబోయే రోజుల్లో మూడు కోట్ల ఇండ్లను నిర్మిస్తామన్నారు. పేద ప్రజలకు ఉజ్వల యోజన కింద 10 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకంలో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందచేస్తున్నామన్నారు.

తెలంగాణలో ఎకనమికల్ కారిడార్లను నిర్మించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఏకలవ్య పాఠశాలలను, కేంద్రీయ విద్యాలయాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని.. విపక్ష కూటమి ప్రధాన మంత్రి ఎవరు? అని ప్రశ్నించారు. పీఎం అభ్యర్థి ఎవరన్నది వాళ్ళకే తెలియదన్నారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని జేపీ నడ్డా ప్రజలను కోరారు.

Similar News