‘స్థానిక’ ఎన్నికలకు గెట్ రెడీ.. కేడర్‌కు కాంగ్రెస్ సూచన
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆ కేడర్‌కు సూచించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆ కేడర్‌కు సూచించింది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించామని, స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ ఆదేశాలిచ్చింది. జూన్ చివరి వారంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కాంగ్రెస్, అందుకు అనుగుణంగా తగిన విధంగా ప్రిపేర్ అవ్వాలని పార్టీ నేతలకు వివరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని నొక్కి చెప్పింది. రాష్ట్రంలో పవర్‌లో ఉండటమే కాకుండా, ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, స్థానిక సంస్థల్లోనూ అత్యధిక మంది కాంగ్రెస్ క్యాండిడేట్స్‌ను గెలిపించి ప్రజలకు అండగా ఉండాలని రాష్ట్ర పార్టీ వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, లోక్‌సభ ఎంపీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నేతలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని టీపీసీసీ భరోసా కల్పించింది. గడిచిన పదేళ్లుగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత లేకపోవడంతో గ్రౌండ్ కేడర్ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తమ దృష్టిలో ఉన్నదని, ఇప్పుడు మీకు మంచి అవకాశం వచ్చిందని టీపీసీసీ స్థానిక కేడర్‌కు వెల్లడించింది. దీంతో ఒక వైపు పార్టీని బలోపేతం చేస్తూనే, ప్రభుత్వ పాలన సజావుగా జరిగేందుకు సహకరించాలని పార్టీ కోరింది.
వర్క్ చేసినోళ్లకే...?
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు అండగా నిలిచోళ్లు, ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన కీలక కేడర్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగంలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నది. ఇదే అంశంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే నేతలను ఎంపిక చేస్తామని గతంలో వెల్లడించారు. ఇప్పుడు అదే విధానంలో స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక ఉండనున్నట్లు తెలుస్తోన్నది. ఆయా జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేయాలని ఆసక్తితో ఉన్న నేతలు, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల వివరాలను వెంటనే రాష్ట్ర పార్టీకి పంపించాలని టీపీసీసీ అన్ని జిల్లాల డీసీసీలకు సూచించింది. అయితే అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక తరహాలోనే అభ్యర్థులను ఫిల్టర్ చేయనున్నట్లు సమాచారం. పోటీకి ఆసక్తితో ఉన్నోళ్లతో దరఖాస్తు చేయించి, ఆ తర్వాత రాష్ట్ర టీపీసీసీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల సహకారంతో క్యాండిడేట్లను సెలక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఈ మేరకు జిల్లాల్లోనూ సెలక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ ఆలోచిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ ప్రాసెస్ మొదలు కానున్నదని రాష్ట్ర పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు.